విడాకుల సెటిల్ మెంట్లతో దివాళా తీస్తున్న మగాళ్లు : పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తున్న 46 శాతం భార్యలు

విడాకుల సెటిల్ మెంట్లతో దివాళా తీస్తున్న మగాళ్లు : పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తున్న 46 శాతం భార్యలు

ఈ రోజుల్లో పెళ్లిళ్లు అవ్వటమై చాలా కష్టంగా మారిపోయింది. ఐటీ జాబ్, అమెరికా వీసా, వెనుక కొండత ఆస్తులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయి ఫ్యామిలీ వాళ్లకు ఉండే కోరికల చిట్టా ఎప్పటికీ తగ్గనిది. ఇలాంటి సమయంలో అవుతున్న పెళ్లిళ్లలో చాలా వరకు ఎక్కువ కాలం నిలవటం లేదు. దీంతో దేశంలో విడిపోతున్న జంటల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఇండివిడ్యువాలిటీ, బిజీ లైఫ్, ఒకరికి ఒకరు సమయం ఇవ్వలేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జంటలు కలిసుండలేం అంటూ కోర్టుకెళుతున్నాయి. 

వాస్తవానికి  భారతదేశ సంస్కృతిలో విడాకులు అనేది కేవలం ఎమోషనల్ విషయం మాత్రమే కాదు. దీని వెనుక భారీ ఆర్థిక ఖర్చులు కొన్ని సార్లు అబ్బాయి, అమ్మాయి జీవితాలను పూర్తిగా మార్చేసే అంశాలు ఉంటుంటాయి. ఈ క్రమంలో విడాకులపై జరిగిన ఒక స్టడీలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. 1258 విడాకులు తీసుకున్న వ్యక్తులను సర్వే చేసినప్పుడు మగవారు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గురించి బయటపడింది. విడాకుల చెల్లింపుల కోసం 42 శాతం మంది పురుషులు ఏకంగా అప్పులు చేయాల్సి వస్తోందని తేలింది.

వాస్తవానికి పురుషులు సంపాదించే దానిలో 38 శాతం ఏటా ఇంటి మెయింటెనెన్స్ కే వెళ్లిపోవటంతో అసలు సేవింగ్స్ అనే మాటే కనిపించటం లేదని తేలింది. పైగా పెళ్లయ్యాక 46 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేయటం వల్ల కూడా మగవారిపైనే పోషణ భారం పెరుగుతోందని తేలింది. అలాగే భార్యకు విడాకులు ఇచ్చేశాక ఆర్థికంగా తమ పరిస్థితి మెరుగుపడిందని చాలా మంది పురుషులు చెప్పారు. విడాకుల సమయంలో భర్త నెట్‌వర్త్ నుంచి 50 శాతం నుంచి 100 శాతానికి పైగా భరణం పొందుతున్నారని తేలింది. 

ఇక పోతే విడాకులకు అప్లై చేసినప్పటి నుంచి కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు, మెయింటెన్స్, హెల్త్ సపోర్ట్ అంటూ ఖర్చులు మగవారిపై తడిచి మోపెడౌతున్నాయని సర్వేలో వెల్లడైంది. పైగా ఇటీవల కోర్టుల్లో చాలా మంది జడ్జిలు విడాకుల సమయంలో భార్యల గొంతెమ్మ కోరికలు విని నెలకు లక్షల్లో భరణంగా కోరుతున్న తీరును విమర్శించటం మనం తరచుగా వార్తల్లో చూస్తునే ఉన్నాం.