బిగ్‌బాస్ రివ్యూ : సూర్య బెస్ట్ కెప్టెన్ అవుతాడా?

బిగ్‌బాస్ రివ్యూ : సూర్య బెస్ట్ కెప్టెన్ అవుతాడా?

ఎమోషనల్‌ టాస్క్ తర్వాత బిగ్‌బాస్ పెట్టిన పోటీలో గెలిచిన ఎనిమిది మంది కెప్టెన్ కుర్చీ ఎక్కేందుకు అర్హత సాధించారు. వారి కోసం మరో టాస్క్ రెడీ చేశాడు బిగ్‌బాస్. అందులో ఎవరు ఎలా పర్‌‌ఫార్మ్ చేశారు? ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారు?

హౌస్‌మేట్స్ రొద.. ఫైమా సొద

ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరే.. ఎదుటివాళ్లు చేసింది నచ్చకపోతే మనసు పెట్టే సొదని, రొదని ఆపతరం కాదు. అందుకే చుట్టూ కెమెరాలు ఉన్న సంగతి హౌస్‌మేట్స్ మర్చిపోతారు. చాన్స్ దొరికితే చాలు.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇవాళ అందరి టాపిక్ ఒకటే.. కెప్టెన్సీ ఎలిజిబిలిటీ టాస్క్ లో ఎవరేం చేశారు, ఎవరెలా ప్రవర్తించారు అని. కీర్తి, ఫైమా, శ్రీసత్య, సుదీప, రోహిత్–మెరీనా అందరూ రకరకాల డిస్కషన్స్ పెట్టారు. అయితే ఫైమా మాత్రం అందరికంటే ఎక్కువ ఫైర్ అయ్యింది. మెరీనా, రోహిత్ ఆడిన విధానాన్ని ఆమె తప్పుబట్టింది. అయినా వాళ్లనే అందరూ సపోర్ట్ చేశారు, మనిద్దరం ఒకటి, మిగతావాళ్లంతా ఒకటి అంటూ కీర్తి దగ్గర కథ మొదలెట్టింది. ఆ తర్వాత అందరి దగ్గరా ఈ టాపిక్ మాట్లాడింది. శాక్రిఫైస్ గేమ్‌లో చేశారా, అందరి కోసం చేశారా అంటూ లాజిక్ మాట్లాడింది. ఎవ్వరూ ఫెయిర్ గేమ్ ఆడటం లేదని అంది. ముఖ్యంగా ఇనయా, సూర్య తనని సపోర్ట్ చేయలేదని బాధపడింది. అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు సుదీపకి సూర్య క్లాప్ కొట్టాడంటూ ఫీలైపోయింది. శాక్రిఫైస్ చేశాడు కాబట్టి తన ముఖం చూసి ఆగిపోయానని అన్నందుకు ఇనయాని క్వశ్చన్ కూడా చేసింది. మొత్తంగా అదే టాపిక్‌ పట్టుకుని చాలాసేపు ఇల్లంతా తిరిగి హడావుడి చేసింది.

కుండీలాటలో తొండి

రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్, శ్రీసత్యలకు ‘ఆఖరి వరకు ఆగని పరుగు’ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒకచోట ఎనిమిది ఖాళీ పూలకుండీలు పెట్టాడు. వాటి మీద ఎనిమిదిమంది పేర్లు ఉంటాయి. ఇంకోవైపు కంటెడర్ జోన్ ఉంది. బజర్ మోగినప్పుడు పోటీదారులు వెళ్లి తమ పూలకుండీని కాకుండా వేరొకరి పూలకుండీని తీసుకుని కంటెండర్ జోన్‌లోకి వెళ్లాలి. చివరగా వెళ్లిన పోటీదారుడు, తన చేతిలో ఉన్న కుండీ మీద ఉన్న ఫొటో ఉన్న పోటీదారుడు పక్కకి వచ్చి తాము ఎందుకు బెటర్ కెప్టెన్ అవుతారో చెప్పాలి. తర్వాత ఇంటి సభ్యులో ఓట్లు వేస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారు నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తారు. మిగతావారు పోటీ నుంచి తొలగిపోతారు. ఉన్న ఎనిమిదిమందీ హుషారుగా ఈ టాస్కులో పాల్గొన్నారు. అయితే బ్రెయిన్ అతి తక్కువగా వాడే రాజ్ తన కుండీ తనే తెచ్చుకుని ముందే డిస్‌క్వాలిఫై అయిపోయాడు. మిగతావారంతా పోటీపడ్డారు. ఒక్కొక్కరూ బైటికి వెళ్లిపోసాగారు. అయితే ఓట్లు వేసేటప్పుడు తన విషయంలో ఆదిరెడ్డి చెప్పిన పాయింట్స్ కు వాసంతి బాగా హర్ట్ అయ్యింది. ఇక సూర్య ఆట ఆడిన విధానానికి రేవంత్‌కి కోపమొచ్చింది. అతను రెండు కుండీలు తీసుకొచ్చి ఒకచోట పడేశాడని, దానివల్ల తనకి కుండీ దొరకలేదని కంప్లయింట్ చేశాడు. అయితే రెండు తీసుకు రాకూడదని లేదు, కంటెండర్‌‌ జోన్‌లోకి రెండు తీసుకెళ్తే తప్పు అని సంచాలకురాలైన ఫైమా చెప్పింది. అది రేవంత్‌కి నచ్చక కాసేపు ఆర్గ్యూ చేశాడు. అది తొండి అన్నాడు. అయినా ఫైమా కన్విన్స్ కాలేదు. ఒక్కొక్కరూ వెళ్లిపోగా చివరికి సూర్య, రాజ్ చివరికి మిగిలారు. రాజ్‌ ఓడాడు. సూర్య కెప్టెన్ అయ్యాడు.

బెస్ట్ కెప్టెన్ అవుతాడా?

సూర్య మీద, అతని ఆటతీరు మీద ప్రేక్షకుల్లో చాలా అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఈవారం అతనిపై నెగిటివిటీ బాగా పెరిగింది. దానికి కారణం ఇనయాతో అతని రిలేషన్. ఆరోహి ఉన్నంతసేపూ ఆమె కోసం ఆటను పక్కన పెట్టాడు. ఆమె ఇలా బైటికి వెళ్లిందో లేదో ఇనయాకి క్లోజైపోయాడు. ఇద్దరూ కలిసి హౌస్‌లో ప్రవర్తిస్తున్న తీరు ఎవరికీ నచ్చడం లేదు. గీత దాటుతున్నారంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కెప్టెన్ అవ్వడం ఒక రకంగా సూర్యకి దొరికిన మంచి చాన్స్. ఇప్పుడైనా అమ్మాయిల మీద కాకుండా అతను తన బాధ్యతపై దృష్టి పెడితే కచ్చితంగా బ్యాడ్ ఇమేజ్ పోతుంది. మంచి ఆటగాడనే పేరు వస్తుంది. అయితే అలా చేస్తాడా లేదా అనేదే అనుమానం. ఎందుకంటే అందరూ సీరియస్‌గా గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అతను, ఇనయా కన్ఫెషన్ రూమ్‌ పక్కనున్న సందులోనో లేక గార్డెన్‌లోనో పడుకుని తమ లోకంలో తాము ఉంటున్నారు. అప్పుడప్పుడు ఫైమా కూడా వీళ్లతో చేరుతున్నా.. ఆమె మిగతా విషయాలపై కూడా కాన్సన్‌ట్రేట్ చేస్తోంది. కానీ వీళ్లిద్దరూ అలా లేరు. అందుకే సూర్య కెప్టెన్‌గా ఏం చేస్తాడు, ఇప్పుడు కూడా ఇనయాకే ఎక్కువ అటెన్షన్ ఇస్తాడా లేక తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడా అనే డౌట్ ఉంది. చెప్పాలంటే అతను మంచి ఎంటర్‌‌టైనర్ కాగలడు. ఎందుకంటే కెప్టెన్ అయ్యాక అందరికీ థ్యాంక్స్ చెబుతూ ప్రభాస్ వాయిస్‌తో ప్రమాణం చేసి అదరగొట్టాడు. తనకున్న ఈ టాలెంట్‌నైనా సరిగ్గా ఉపయోగించుకుంటే అతను రాణించగలడు. 

వీళ్లు మారాల్సిందే!

కుక్క తోక వంకర అన్నట్టు హౌస్‌లో కొంతమంది మారడం లేదు. వాళ్లలో గీతక్క కూడా ఉంది. ఈవిడ అత్యుత్సాహం మామూలుగా ఉండదు. అన్ని విషయాల్లో దూరిపోద్ది. అందరికీ సలహాలిచ్చేస్తుంది. తీర్పులూ చెప్పేస్తుంది. కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యే ముందు సూర్యకి గీతోపదేశం చేసింది. బాలాదిత్య, శ్రీసత్య ఏదో విషయానికి ఆర్గ్యూ చేసుకుంటుంటే మధ్యలో వెళ్లిపోయి మాట్లాడేసింది. అసలు ఇది చెప్పడానికి నువ్వెవరు అని బాలాదిత్య అన్నా కూడా ఆమె తగ్గిందే లేదు. ఇక ఇనయా సంగతి వేరే లెవెల్. మేడమ్ ఆటని పూర్తిగా మర్చిపోయింది. సూర్య జపంతో కాలయాపన చేస్తోంది. ఆల్రెడీ నిన్న తాను తింటున్న లాలీపాప్‌ని సూర్య నోటికి అందించిన వీడియో ఇవాళ ఫుల్లుగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఇక ఈ ఎపిసోడ్‌లో కూడా తన ప్రేమని తెగ ప్రదర్శించింది. బాల్ టాస్క్లో సూర్య వల్ల హర్ట్ అయిన ఫైమా వచ్చి బాధ చెప్పుకుంటుంటే తనకి సూర్యయే ముఖ్యమన్నట్టు మాట్లాడింది. తనకు ప్రతి క్షణం తోడుగా ఉండే ఫ్రెండ్ ఫైమానే అని కూడా ఆలోచించలేదామె. తర్వాత సూర్య, రాజ్‌లలో ఒకరికి ఓట్ చేయాల్సి వచ్చినప్పుడు బ్రదర్‌‌కి వేయాలా, బావకి వేయాలా అంటూ సిగ్గులు ఒలకబోసింది.

సూర్య కెప్టెన్ అయ్యాక పాత కెప్టెన్ వెళ్లి చెయిర్‌‌లో కూర్చోబెడుతున్నప్పుడు అందరినీ తోసుకుంటూ వెళ్లి పక్కన నిలబడింది. ఇక సూర్య కోసం బిగ్‌బాస్ పంపిన లెటర్‌‌ కూడా నేను చదువుతానంటూ ఎగబడింది. అతని లెటర్ చదివే హక్కు తనకి మాత్రమే ఉందన్న రేంజ్‌లో ఫీలైపోయి రేవంత్‌తో గొడవేసుకుంది. ఈ తీరు ఇనయాకి ఎంత బ్యాడ్ అవుతోందో ఆమెకి తెలియడం లేదు. ఆమె మారకపోతే ఇక ఎవ్వరూ కాపాడలేరు. ఇక ఆదిరెడ్డి సంగతి. తాను చాలా బాగా మాట్లాడతాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది. అందుకే ఏదో చెప్పాలని ట్రై చేసి ఏదేదో మాట్లాడేస్తుంటాడు. ఇవాళ వాసంతి కంటే తాను కెప్టెన్‌గా బెటర్ అని చెప్పుకునే ప్రయత్నంలోనూ కొన్ని అనవసరమైన కామెంట్లు చేసి ఆ అమ్మాయిని బాధపెట్టాడు. అలాగే సూర్య కూడా కెమెరాలతో మాట్లాడి నస పెట్టడం ఆపకపోతే జనాలు విసిగిపోవడం ఖాయం. అస్తమానం అతని ఆత్మఘోష వినలేక చిరాకు పుడుతోంది. అమ్మా.. నేను బైటికి రాగానే నీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాను అంటూ ఇవాళ మరీ ఓవర్ చేశాడు. వీళ్లందరి ఆటలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఇవి. వాటిని మార్చుకుంటే మరింత ఆదరణ దక్కుతుంది. 

మొత్తంగా ఇవాళ్టి ఎపిసోడ్ మొత్తం కెప్టెన్సీ టాస్క్ కు  అంకితమయ్యింది. ఆ తర్వాత భార్యాభర్తలైన మెరీనా, రోహిత్‌లకి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కర్‌‌వా చౌథ్ చేసుకునే అవకాశం కల్పించాడు. దాంతో మెరీనా, రోహిత్‌ సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక రేపు నాగార్జున రాబోతున్నారు. ఈవారం అందరి ఆట ఎలా ఉందో అనలైజ్ చేయబోతున్నారు. ఎవరికి మొట్టికాలు వేస్తారో, ఎవరికి మంచి మార్కులు వేస్తారో చూడాలి మరి.