
దుబాయ్: ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లను ఇకపై రైవల్రీ (పోటాపోటీ సాగే వైరం)తో పోల్చడం ఆపాలని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దాయాదుల మ్యాచ్‌లో ఇండియానే పూర్తి ఆధిపత్యం చూపిస్తోందని చెప్పాడు. ఇండియా చేతిలో పదే పదే ఓడుతున్న పాకిస్తాన్‌తో అసలు తమకు పోటీనే లేదని, అలాంటప్పుడు రైవల్రీ ప్రస్తావన అనవసరం అన్నాడు. ఆసియా కప్ సూపర్– 4 మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అనంతరం సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇండియా– పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడితే టీమిండియా ఏకంగా12 సార్లు విజయం సాధించింది.
ఆదివారం రాత్రి జరిగిన ఏకపక్ష మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ తమ టీమ్ ప్రమాణాలు, ఇరు జట్ల మధ్య వ్యత్యాసం గురించి సూర్యకుమార్‌ను ప్రశ్నించాడు. దానికి సూర్యకుమార్ నవ్వుతూ ‘సర్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌లను ఇకపై రైవల్రీ అని పిలవొద్దు. అసలు దీన్ని పోటీ అని ఎలా అంటాం? రెండు జట్ల మధ్య 15–-20 మ్యాచ్‌లు జరిగితే వాటిలో 7-–7 లేదా 8–-7 లాంటి సమానమైన గెలుపోటములు ఉంటే దాన్ని రైవల్రీ అనొచ్చు. కానీ మేం 13-–0 లేదా 10-–1తో ఆధిపత్యం ఉన్నప్పుడు ఇందులో పోటీ ఎక్కడ ఉంది? ఇది ఎంతమాత్రం రైవల్రీ కాదు. మేం వాళ్ల కంటే చాలా మెరుగ్గా ఆడుతున్నాం’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ వర్గాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
దూబే బౌలింగే టర్నింగ్ పాయింట్
పాక్ జట్టు 10 ఓవర్లలో 91 రన్స్ సాధించి బలమైన స్థితిలో ఉన్నప్పుడు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చిందని సూర్యకుమార్ అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో తొలి డ్రింక్స్ బ్రేక్ తర్వాతే ఆట మారింది. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మారిపోయింది. సాధారణంగా పవర్‌ప్లే తర్వాతే ఆట మలుపు తిరుగుతుంది. కానీ ఈరోజు 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ మార్చుకుని సరైన ప్రణాళికతో బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు కూడా అద్భుతంగా రాణించారు. నా ఉద్దేశంలో శివమ్ దూబే బౌలింగే మ్యాచ్‌కు అసలైన టర్నింగ్ పాయింట్. తను నెట్స్‌లో బౌలింగ్‌ను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అతనికి ఈ మ్యాచ్‌లో పూర్తి ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం దొరికింది. తను చాలా సంతోషంగా ఉన్నాడు. దూబే ఇలాంటి అవకాశాల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు’ అని సూర్యకుమార్ ప్రశంసించాడు. ఇక, ఈ మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చుకున్న స్టార్ పేసర్ బుమ్రాపై కెప్టెన్ సూర్యకుమార్ భరోసా ఉంచాడు. ప్రతీసారి రాణించడానికి అతను రోబో కాదన్నాడు. అప్పుడప్పుడు బౌలర్లకు ఇలాంటి రోజు వస్తుందన్న సూర్య.. ఈసారి శివం దూబే తమను ఆదుకున్నాడని చెప్పాడు.
కవ్వించారు.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చా: అభిషేక్ శర్మ
ఛేజింగ్‌లో భారీ హిట్టింగ్‌తో పాక్ పని పట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి ఆటగాళ్లు తమతో వాగ్వాదానికి దిగారని, అది తనకు నచ్చలేదని చెప్పాడు. ‘వాళ్ళు కారణం లేకుండా మా మీదకు దూసుకొచ్చిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. నా దూకుడైన బ్యాటింగే వాళ్లకు నేను ఇవ్వగలిగిన సరైన సమాధానం. అదే ఇచ్చాను‘ అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పేర్కొన్నాడు.