IND vs AUS 1st T20I: దిగ్గజాలను వెనక్కి నెట్టిన టీమిండియా కెప్టెన్.. సిక్సర్లలో సూర్య వరల్డ్ రికార్డ్

IND vs AUS 1st T20I: దిగ్గజాలను వెనక్కి నెట్టిన టీమిండియా కెప్టెన్..  సిక్సర్లలో సూర్య వరల్డ్ రికార్డ్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ లో ఎంత ప్రమాదకారి అనే విషయం మరోసారి రుజువైంది. సిక్సర్లు కొట్టడంలో సూర్య తనకు తానే సాటి. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్ అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన బ్యాటర్ గా నిలిచాడు. కేవలం 86 ఇన్నింగ్స్‌లలో 1,649 బంతులను ఎదుర్కొని సూర్య ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 10 ఓవర్లో ఎల్లిస్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచి సూర్య అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 150 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా సూర్య 24 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు

యూఏఈ కి చెందిన ముహమ్మద్ వసీం సూర్య కంటే తక్కువ ఇన్నింగ్స్ ల్లో 150 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. వసీం 66 ఇన్నింగ్స్‌లలో 1,543 బంతుల్లో 150 సిక్సర్లు బాదాడు. అయితే, వసీం ఐసీసీ అసోసియేట్ సభ్య దేశానికి చెందినవాడని గమనించాలి. ఓవరాల్ గా అంతర్జాతీయ టీ20ల్లో 150 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ 205 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.  వసీం (187), మార్టిన్ గుప్టిల్ (173), జోస్ బట్లర్ (172) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 150 సిక్సర్లతో సూర్య ఐదో స్థానంలో నిలిచాడు. ఇండియాలో రోహిత్ తర్వాత 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ గా సూర్య నిలిచాడు. 

►ALSO READ | IND vs AUS 1st T20I: వర్షంలో కొట్టుకుపోయిన సూర్య, గిల్ మెరుపులు.. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు

వర్షం కారణంగా తొలి టీ20 రద్దు:   

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  బుధవారం (అక్టోబర్ 29) కాన్ బెర్రాలోని మనూక ఓవల్‎ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కు పలుమార్లు వరుణుడు అడ్డు రావడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడలేదు. వర్షం పడే సమయానికి ఇండియా 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. మొదట వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. గిల్ (37), సూర్య కుమార్ యాదవ్ (39) అజేయంగా నిలిచారు. అభిషేక్ శర్మ (19) విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్ కు ఒక వికెట్ దక్కింది.