- టీమిండియాలోకి వైభవ్.. సచిన్ రికార్డు బద్దలుకొట్టిన వండర్ కిడ్
- 15 ఏండ్ల 71 రోజుల వయసులోనే దొరికిన ఎంట్రీ
- 16 ఏండ్ల 205 రోజుల ఏజ్‌లో టీమ్‌లోకి వచ్చిన సచిన్
- ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ
- టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్, వైస్ కెప్టెన్ మన తిలక్
- కెప్టెన్సీతోపాటు జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్
ముంబై: ఐపీఎల్–19లో దంచికొట్టిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా క్రీడల కోసం శనివారం ఎంపిక చేసిన టీమిండియాలో వైభవ్‌కు చోటు దక్కింది. దాంతో ఇండియా టీమ్‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుడిగా (15 ఏళ్ల 71 రోజులు) వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఫలితంగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిటి ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన వైభవ్ 237.30 స్ట్రయిక్ రేట్‌తో 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. దాంతో ఈ యువ ఓపెనర్‌ను అటోమేటిక్‌గా జట్టులోకి తీసుకొచ్చారు. ఇక ఇండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు.
టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. తెలుగు బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్ జట్లను విజయవంతంగా నడిపించిన అనుభవం ఉండటంతో సెలెక్టర్లు ఏకగ్రీవంగా శ్రేయస్ వైపు మొగ్గు చూపారు.
పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి చోటు దక్కగా, గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన హర్షిత్ రాణా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్ల నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఆసియా క్రీడల టైమ్‌కు అతను జట్టుతో చేరతాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏ జట్టులోనూ చోటు దక్కలేదు. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, జూలై 1 నుండి 11 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు జరగనున్నాయి.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఆసియా క్రీడల జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వైభవ్ సూర్యవంశీ.
