
యూఏఈ వేదికగా జరుగుతోన్న ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసియా కప్‌లో వారం వ్యవధిలోనే రెండుసార్లు తలపడ్డ చిరకాల ప్రత్యర్థుల సమరంలో రెండోసారి కూడా ఇండియా పైచేయి సాధించింది. గ్రూప్ దశలో ఒకసారి దాయాది దేశాన్ని చిత్తు చేసిన టీమిండియా.. గ్రూప్-4 దశలో ఇంకోసారి కసితీరా కొట్టేసింది. ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఇదిలా ఉంటే.. అసలే ఇండియాపై వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి తీవ్ర అసహనంలో ఉన్న పాకిస్తాన్ పరువు మరింత తీశాడు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆదివారం (సెప్టెంబర్ 21) మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇండియా, పాక్ పోటీ గురించి జర్నలిస్టులు ప్రశ్నించగా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎటువంటి పోటీ లేదని.. ఇక దాని గురించి ప్రశ్నలు ఆడగటం ఆపేయాలని జర్నలిస్టులను కోరాడు. ఇలా ఎందుకు అన్నాడో కూడా క్లారిటీ ఇచ్చాడు సూర్య. ‘‘ఏదైనా రెండు జట్ల మధ్య 15- మ్యాచులు జరిగితే అందులో ఇరు జట్లు చెరో 7-8 మ్యాచులు గెలిస్తే పోటాపోటీ ఉన్నట్లు. కానీ ఒకే జట్టు 12-13 మ్యాచులు గెలిస్తే పోటీ ఎలా ఉన్నట్లు..? కచ్చితంగా ఇక్కడ పోటీ లేదు. ఇకపై పాకిస్తాన్‌తో మాకు పోటీ అనొద్దు. ఎందుకంటే మేము వారి కంటే మెరుగైన స్థితిలో ఉన్నాం’’ అని దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చాడు సూర్య.
అసలే వరుస ఓటములతో బాధలో ఉన్న పాకిస్తాన్‌కు కెప్టెన్ సూర్య మాటలు పుండు మీద కారం చల్లినట్లైంది. అయితే.. ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన మ్యాచులో పాక్ ప్లేయర్లు హద్దు మీరి ప్రవర్తించారు. ఇండియన్స్‌ను రెచ్చగొట్టేలా గ్రౌండ్లో ఓవరాక్షన్ చేశారు. దీంతో సూర్యకు వాళ్లకు కరెక్ట్ సమాధానమిచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.