సూర్య కుమార్ యాదవ్‌కు గాయం..వరల్డ్ కప్ ఆడేది అనుమానమే

సూర్య కుమార్ యాదవ్‌కు గాయం..వరల్డ్ కప్ ఆడేది అనుమానమే

2024 జూన్ లో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ లకు ముందు భారత్ కు  గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ కు ఈ టీ20 చిచ్చర పిడుగు దూరమయ్యాడు. స్కానింగ్ లో సూర్య గాయం తీవ్రమైతే సర్జరీ చేయించుకోవాల్సిందే. అదే జరిగితే ఈ ముంబై బ్యాటర్ ఎప్పుడు క్రికెట్ లోకి అడుగుపెడతాడో చెప్పడం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో భారత్ ను గెలిపించిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ20లో సఫారీలపై టీమిండియా గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో బంతిని ఆపే క్రమంలో సూర్య వెనక్కి ట్విస్ట్ అయ్యాడు. కాలు పట్టేయడంతో నడవలేకపోయాడు. దీంతో వైద్య  సిబ్బంది మోసుకుంటూనే సూర్యను తీసుకెళ్లారు. నొప్పితో విలవిల్లాడిన సూర్య మళ్ళీ మైదానంలో కనిపించలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తాను బాగానే ఉన్నానని ఈ స్టార్ బ్యాటర్ తెలిపాడు.

ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టీ20 లకు మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే, టెస్టులకు ఈ ముంబై బ్యాటర్ కు సెలక్టర్లు పక్కన పెట్టేసినట్లుగానే కనిపిస్తుంది. వరల్డ్ కప్ తర్వాత సూర్యకు టీ20పగ్గాలు అప్పగించారు. సూర్య కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ కు 4-1 తేడాతో గెలవగా..దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మూడు టీ20 ల సిరీస్ ను 1-1 తో డ్రా చేసుకుంది.