సూర్యాపేటలో ఆగని అరెస్టులు

సూర్యాపేటలో ఆగని అరెస్టులు

సూర్యాపేట, వెలుగు: డీసీ‌ఎం‌ఎస్ చైర్మన్ వట్టె జానయ్య కేసులపై స్పందిస్తూ మంత్రి జగదీశ్‌ రెడ్డికి సెల్ఫీ వీడియో పెట్టిన ఆయన అనుచరులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కిందనే వదిలేసిన జానయ్య మేనల్లుడు అవుదొడ్డి శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరిని ఆదివారం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో జానయ్యకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నిరంజన్‌ను రిమాండ్‌కు తరలించారు. మరోపక్క మంత్రి జగదీశ్‌ రెడ్డి, పోలీసులతో తమ ఇద్దరు కొడుకులకు ప్రాణహాని ఉందని జానయ్య అక్క ఆవు దొడ్డి భాగ్యమ్మ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆమె ఇంట్లో మీడియాతో మాట్లాడారు.  మంత్రి జగదీశ్‌ రెడ్డి కోసం తాను, తన  కొడుకులు ఎంతో త్యాగం చేశారన్నారు. 

ALSO READ :పీఆర్ఎల్ఐ చుట్టే పాలిటిక్స్.. సెప్టెంబర్ 16న నార్లాపూర్ కు రానున్న కేసీఆర్

వట్టే జానయ్య యాదవ్​కు, మంత్రి జగదీశ్​ రెడ్డికి తగాదాలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి గాని, తమ కొడుకులను అరెస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించారు.  చిన్న పాపకు మందులు తెస్తానన్న తన కొడుకు ఇంతవరకు కనిపించలేదని, ఆరా తీస్తే పోలీసులు తీసుకెళ్లారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళన జానయ్య యాదవ్​ను అరెస్టు చేయాలని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట జానయ్య బాధితులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ  జానయ్యపై కేసులు నమోదు చేసి 15 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆక్రమణకు గురైన తమకు భూములను తమకు ఇప్పించాలని కోరారు.