పీఆర్ఎల్ఐ చుట్టే పాలిటిక్స్.. సెప్టెంబర్ 16న నార్లాపూర్ కు రానున్న కేసీఆర్

పీఆర్ఎల్ఐ చుట్టే పాలిటిక్స్.. సెప్టెంబర్ 16న నార్లాపూర్ కు రానున్న కేసీఆర్
  • భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • ప్రాజెక్టుల సందర్శన పేరుతో విపక్షాల హడావుడి
  • అడ్డుకుంటున్న పోలీసులు

వనపర్తి, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇటీవల కొల్లాపూర్  సమీపంలోని పాలమూరు లిఫ్ట్​కు సంబంధించిన నార్లాపూర్  పంప్ హౌజ్ లో డ్రై రన్ నిర్వహించింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్విచ్​ ఆన్  చేసి పంప్ ను పరీక్షించారు. డ్రై రన్  సక్సెస్​ కావడంతో సీఎం కేసీఆర్  ఈ నెల 16న వెట్ రన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు వీరి తీరును  తప్పుపడుతున్నాయి.

30 శాతం పనులు కూడా పూర్తి కాని పీఆర్ఎల్ఐ స్కీం వెట్ రన్ చేయడం ద్వారా రైతులకు కలిగే లాభం ఏమిటని కాంగ్రెస్  పార్టీ విమర్శిస్తోంది. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ పథకం పనులను పరిశీలించేందుకు ప్రాజెక్ట్  సందర్శనకు శనివారం బయలుదేరడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల కాంగ్రెస్  పార్టీ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు..

పీఆర్ఎల్ఐపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను అధికార పార్టీ నేతలు తప్పు పడుతుండగా, ప్రతిపక్షాలు సైతం దీటుగా స్పందిస్తున్నాయి. పాలమూరు ప్రాజెక్ట్  నిర్మాణాన్ని అడ్డుకొని గ్రీన్ టిబ్యునల్ లో కేసు వేసిన కాంగ్రెస్  పార్టీకి పాలమూరు ప్రాజెక్ట్ పరిసరాల్లో అడుగు పెట్టే అర్హత లేదంటూ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రాంత ప్రయోజనాలను కాలరాస్తూ లిఫ్ట్​ నిర్మాణంలో ఆలస్యానికి కారణమైన కాంగ్రెస్  పార్టీ మరోసారి రైతుల ప్రయోజనాలను అడ్డుకుంటోందని మండిపడ్డారు.

ALSO READ :కేయూలో సెలవులు పొడిగింపు.. హాస్టళ్లకు తాళాలు
 

ఇదిలాఉంటే పాలమూరు ప్రాజెక్ట్  డిజైన్ ను మార్చడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచి సీఎం కేసీఆర్  కుటుంబం లక్ష కోట్ల రూపాయలను నొక్కేసిందని మాజీ మంత్రి చిన్నారెడ్డి అరోపిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు లిఫ్ట్​ పనులను 2015లో ఒకేసారి ప్రారంభించిన సర్కారు పాలమూరుపై వివక్ష చూపిందని విమర్శించారు. చివరలో ఉండే గౌరిదేవిపల్లి రిజర్వాయర్  పనులు చేపట్టకుండా నార్లాపూర్  వద్ద పంపులు ప్రారంభించి ఏం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే కేసీఆర్  జిమ్మిక్కులు చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి విమర్శిస్తున్నారు. 

సీఎం సభకు భారీ ఏర్పాట్లు..

సీఎం  సభకు వారం రోజుల ముందు నుంచే బీఆర్ఎస్  నాయకులు హడావుడి చేస్తున్నారు. నార్లాపూర్  సర్జ్ పూల్  వద్దకు ఇప్పటి నుంచే ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నెల 16న  సీఎం కేసీఆర్  వెట్ రన్  చేయనుండడంతో దీనిని సక్సెస్​ చేసేందుకు ఇరిగేషన్  ఆఫీసర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే మకాం వేసి పనులను సమీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పిస్తుండడంతో వెట్ రన్  విషయంలో ఎలాంటి తేడా రాకుండా ఒకటికి రెండు సార్లు చెక్  చేసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఇక్కడి ఇంజనీర్లను ఆదేశించారు.

ఈ పథకంపై విద్యార్థులు, యువకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని ప్రభుత్వం విద్యార్థులతో చెప్పిస్తుండడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. సీఎం సభను అడ్డుకుంటామని కాంగ్రెస్  పార్టీ ఇప్పటికే హెచ్చరించడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. 

నిర్వాసితుల కష్టాలు తీరలే..

పీఆర్ఎల్ఐ స్కీమ్​కు ప్రభుత్వం 2015 జూన్ 11 న శంకుస్థాపన చేసింది. 1,226 గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్  సిటీకి ఇక్కడి నుంచి మంచినీళ్లు అందించాలని పర్మిషన్​ తీసుకుంది. దీంతో పాటు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుగా డిజైన్​ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి 27,046 ఎకరాల పట్టా, ప్రభుత్వ, ఫారెస్ట్  భూములను ప్రభుత్వం సేకరించింది.

రైతుల నుంచి సేకరించిన భూములు, ఇండ్లకు సంబంధించి పరిహారం ఇంకా రాలేదని నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. ఏదుల, వట్టెం రిజర్వాయర్లలో మునిగిన గ్రామాల స్థానంలో ఆర్అండ్ఆర్  కింద పూర్తి స్థాయిలో పునరావాసం ఇప్పటికీ కల్పించలేదు. వర్షాకాలంలో ఇండ్లు లేక ఎనిమిదేండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్ఆర్  కాలనీలు నిర్మించకుండా ప్రాజెక్ట్ ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు.