అనర్హులకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా

అనర్హులకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా

మునగాల(మోతె),వెలుగు :  సూర్యాపేట జిల్లా మోతె మండలంలో డబుల్​ బెడ్​రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం బాధితులు  తహసీల్దార్ ​ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కలెక్టర్​ వచ్చి హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మించారు. అరగంట తర్వాత పోలీసులు వచ్చి తాళం తీయించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలోనే ధర్నా నిర్వహించారు. 

ఆందోళనకు సీపీఎం, కాంగ్రెస్​పార్టీల లీడర్లు  మద్దతు పలికారు. బాధితులు మాట్లాడుతూ మోతె మండలంలో రావిపహాడ్, అప్పన్నగూడెం, విభలాపురం, నాగయ్య గూడెం గ్రామాల్లో నిర్మించిన150 ఇండ్లను అనర్హులకు ఇచ్చారన్నారు. వ్యవసాయ భూములు, స్థలాలు , ఇండ్లున్నవారికే మళ్లీ ఇండ్లు ఇచ్చారన్నారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ  అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కేంతవరకు అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. 

తర్వాత బాధితులు డిప్యూటీ తహసీల్దార్​ సోమపంగు సూరయ్యకు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెట్టి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ నాయక్, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ మండల అధ్యక్షుడు బొర్రాజు ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకట్ పాల్గొన్నారు.