టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ @48.. గోదావరిఖనిలో  భానుడి భగభగ

టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ @48.. గోదావరిఖనిలో  భానుడి భగభగ
  • గోదావరిఖనిలో  భానుడి భగభగ
  • సూర్యాపేట జిల్లాలో 47 డిగ్రీలు నమోదు
  • వడగాడ్పులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు
  • సింగరేణి ప్రాంతంలో భానుడి భగభగ
  • సూర్యాపేట జిల్లాలో 47 డిగ్రీలు రికార్డు
  • వడగాడ్పులు, ఉక్కపోతతో  జనం తీవ్ర ఇబ్బందులు

వెలుగు, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం పలుచోట్ల అత్యధికంగా 47 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ భయానికి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇండ్లలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్, ఖమ్మంలో మంగళవారం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో మెయిన్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కరీంనగర్‌‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే తెలంగాణ చౌక్, బస్టాండ్ సెంటర్, టవర్ సర్కిల్‌, ఖమ్మంలోని వైరా రోడ్డు, చర్చి కాంపౌండ్ సెంటర్ బోసిపోయి కనిపించాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్, మేళ్లచెరువు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో 47 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి..

గనుల్లో షిఫ్ట్​ టైమింగ్​ మార్చండి..

కోల్‌ ‌బెల్ట్‌‌ ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుట్టూ బొగ్గు గనులు ఉన్న గోదావరిఖనిలో 47 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. మంగళవారం ఎండ తీవ్రత అధికంగా ఉంది. బంగారి కనకరాజు అనే సింగరేణి కార్మికుడు గోదావరిఖని మెయిన్‌‌ చౌరస్తాలో రోడ్డుపైనే గుడ్డును పగలగొట్టి ఆమ్లేట్‌‌ వేశాడు. ఓసీపీల్లో మధ్యాహ్నం పూట కార్మికులు పని చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో షిఫ్ట్ టైమింగ్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదు. తాజా పరిస్థితిని చూసైనా పనివేళలు మార్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌‌ చేస్తున్నారు.