వివాదాస్పదంగా మారిన సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

వివాదాస్పదంగా మారిన సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లా: జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డిని పొగుడుతూ ‘జయహో జగదీశ్ రెడ్డి’ అంటూ ఆయన నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... సభకు హాజరైన ప్రతి ఒక్కరూ మంత్రి జగదీశ్ రెడ్డికి బహుమతి ఇవ్వాలని కోరారు. సభకు వచ్చిన వాళ్లంతా తానిచ్చే నినాదాలతో స్వరం కలపాలన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిని ప్రశంసిస్తూ ‘జయహో జగదీశ్ రెడ్డి’ అంటూ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు. అంతే కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలి అని పొగుడుతూ ఆకాశానికెత్తారు. 

ఎస్పీ వ్యవహారశైలితో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి ఎస్పీ అలాంటి నినాదాలు చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. అయితే ఎస్పీ నినాదాలు చేస్తున్న సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి స్టేజీపైనే ఉన్నారు. మంత్రి సహా ఏ ఒక్కరు కూడా ఎస్పీని వారించలేదు. జిల్లా  స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఈ విధంగా నినాదాలు చేయడంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.