క్వాలిటీ పేరుతో కోతలు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల దోపిడీ 

క్వాలిటీ పేరుతో కోతలు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల దోపిడీ 

సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఐకేపీ సెంటర్‌‌‌‌కు 10 రోజుల క్రితం ఓ రైతు వడ్లను తీసుకొచ్చాడు. తాలు ఎక్కువగా ఉందని వారం రోజుల పాటు కాంటా వేయకుండా పక్కకు పెట్టారు. అయితే అసలు తాలు లేకుండానే ఎక్కువగా ఉందని చెప్పి ఎందుకు కాంటా వేయరని సెంటర్ నిర్వాహకులతో రైతు వాగ్వాదానికి దిగాడు. దీంతో వారం రోజుల క్రితం కాంటా వేసి వడ్లను పక్కకు పెట్టారు.మూడు రోజుల క్రితం వడ్లను మిల్లుకు తరలించగా, ఒక్కో బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు పెట్టారు. దీనిపై మిల్లర్‌‌‌‌ను రైతు నిలదీశాడు. కోత లేకుండా వడ్లను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదని, కట్ చేస్తేనే దిగుమతి చేసుకుంటానని మిల్లర్ తేల్చి చెప్పాడు. రోజులు తరబడి నిరీక్షించలేక చివరికి రైతు కటింగ్​  ఒప్పుకున్నాడు.

  •  ఒక్కో లారీకి తాలు పేరుతో 5 నుంచి  8క్వింటాళ్ల కోత 
  • కోత లేకపోతే వడ్లు దించుకోమని హుకుం
  •  రోజుల తరబడి సెంటర్లలో నిరీక్షించలేక మిల్లర్ల డిమాండ్ కు ఒకే చెప్తున్న రైతులు

సూర్యాపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ దోపిడీ మాత్రం కొనసాగుతూనే ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లులకు చేరే వరకు రైతులను వివిధ రకాలుగా దోపిడీ చేస్తున్నారు. చివరకు రైస్ మిల్లులకు చేరిన వడ్లలోనూ భారీ కోతలు విధించి రైతులను నష్టాల్లోకి నెడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మిల్లర్లు క్వాలిటీ పేరుతో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ రైతులను దోపిడీ చేస్తున్నారు. ఒక్కో లారీకి తాలు పేరుతో 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు వడ్లను కోత పెడుతూ యాసంగి సీజన్‌‌‌‌లో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు.---

ఒక్క లారీకి ఐదు క్వింటాళ్ల వరకు కోత

జిల్లా వ్యాప్తంగా యాసంగి   వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యంలో తాలు లేకుండా తుర్పార బట్టి తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలి.  అయితే తూకం వేసిన తరువాత రైస్ మిల్లర్లు ఒక్కో వడ్ల బస్తాకు 2 కిలోల చొప్పున, క్వింటాల్‌‌‌‌కు 5 కిలోల వరకు కోత విధిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి పంపించిన ట్రక్ షీట్‌‌‌‌లలో ఈ కోతలను తగ్గించి రైతులకు అందిస్తున్నారు.  తూకం వేసిన రోజునే కాకుండా ఆలస్యంగా పంపించడం వల్ల కొందరు రైతులు ఈ విషయం గుర్తించలేకపోతున్నారు. మరికొందరు రైతులు గుర్తించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ ధాన్యం కొనుగోలులో 5 కిలోల కోత విధించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో లారీలో 700 నుంచి 800 బస్తాల వడ్లను మిల్లులకు పంపిస్తుండగా, క్వింటాల్‌‌‌‌కు 5 కిలోల కోత విధించడం వల్ల జిల్లాలో కొనుగోలు చేసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది. ఇలా ఒక్కో లారీకి 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ధాన్యం కోత పెడుతున్నారు.

తూకంలో తేడాలు

కొనుగోళ్ల సమయంలో కూడా రైతులను దోపిడీ చేస్తున్నారు. వాస్తవానికి 40 కిలోల బస్తాకు సంచి బరువుగా 650 గ్రాములు అదనంగా తూకం వేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల్లో అదనంగా మరో 100 గ్రాముల వరకు ఎక్కువగా తూకం వేస్తున్నారు. హమాలీకి కూలీగా క్వింటాల్‌‌‌‌కు రూ.25 నిర్ణయించగా, అదనంగా రూ.10 నుంచి రూ.12.50 వరకు పెంచి రూ.35 నుంచి రూ.37.50 వరకు వసూలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరించాలి.

అయితే లారీ యజమానులు రైతుల వద్ద నుంచి బస్తాకు రూ.2 నుంచి రూ.10 వరకు (క్వింటాల్‌‌‌‌కు రూ.5 నుంచి రూ.25 వరకు) వసూలు చేస్తున్నారు. తూకంలోనూ, హమాలీ ఛార్జీల్లోనూ, రవాణా ఖర్చుల్లోనూ రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇవన్నీ జరిగినా ధాన్యం కొనుగోలు అవుతుందనే ఆశతో రైతులు మిన్నకుండిపోతున్నారు. చివరకు రైస్ మిల్లులకు చేరిన తరువాత కూడా కోతల పేరుతో మిల్లర్లు భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ట్రక్ షీట్ వచ్చిన తరువాత అసలు మోసం తెలిసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి వసూళ్లను తట్టుకుని మిల్లులకు చేరేసరికి మళ్లీ అదే దోపిడీ జరుగుతోందని రైతులు
 వాపోతున్నారు. 

రెండు క్వింటాళ్ల వడ్లు కట్ ​చేశారు

తుంగతుర్తి ఐకేపీ   ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 పుట్ల వడ్లు  కాంటా వేశాం. మిల్లుకు వెళ్లిన తర్వాత వడ్ల నాణ్యత బాగాలేదన్నారు. రెండు క్వింటాల వడ్లు కటింగ్ చేశారు.-బద్ది సుధాకర్, రైతు,  తుంగతుర్తి

మూడు క్వింటాళ్లు కట్​ చేశారు 

తుంగతుర్తి సొసైటీ ఆధ్వర్యంలో వెంపటి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 160 కింటాళ్ల ధాన్యాన్ని   కాంటాలు వేసినం.  కాంటా  సమయంలో ధాన్యం కరెక్ట్ గానే ఉంది.  మిల్లుకు వెళ్లగానే కాంటాలు కరెక్ట్ గా లేవని మూడు క్వింటాల వడ్లు కట్ చేశారు. రమణ బోయిన వెంకటేశ్​, రైతు  వెంపటి గ్రామం