సూర్యాపేట ఎస్పీ ఆఫీస్నూ వదల్లే.. వెంచర్ చేసి ఇండ్లు కడుతున్న బీఆర్ఎస్ లీడర్లు

సూర్యాపేట ఎస్పీ ఆఫీస్నూ వదల్లే.. వెంచర్ చేసి ఇండ్లు కడుతున్న బీఆర్ఎస్ లీడర్లు
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో 33 గుంటలు కబ్జా
  • సర్వే నంబర్ మార్చి హాంఫట్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు 
  • వెంచర్ చేసి ఇండ్లు కడుతున్న వైనం
  • ఇదంతా తెలిసినా నిర్లక్ష్యంగా జిల్లా అధికారులు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో కారు లీడర్ల కబ్జాలకు హద్దే లేకుండా పోయింది. కలెక్టరేట్ కు సమీపంలోనే కోట్ల విలువైన భూములను కబ్జా పెట్టారు. ఆపై అక్రమంగా రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ఎస్పీ ఆఫీసుకు చెందిన 33 గుంటల భూమిని కూడా హాంఫట్ చేసేశారు. ఆపై వెంచర్ చేసి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా జిల్లా అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 

20 ఎకరాలు కేటాయింపు

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీస్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది.  ఎస్పీ ఆఫీస్ కోసం నల్ల చెరువుకు సమీపంలోని 671 సర్వే నంబర్ లో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అంతేకాకుండా ఎస్పీ ఆఫీసు పక్కనే బీఆర్ఎస్ ఆఫీస్, గౌడ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ భవన్ కు ఎకరం చొప్పున ఇచ్చింది. ఈ ప్రాంతం విజయవాడ –-- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉండడం, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. గజం స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.10 వేలకుపైనే ఉంది.

సుమారు ఎకరం స్థలం హాంఫట్

 ఎస్పీ ఆఫీసుకు కేటాయించిన స్థలానికి సమీపంలోని నల్ల చెరువు 394.08 ఎకరాల్లో విస్తరించింది. దీనిలో 214. 06 ఎకరాల్లో శిఖం భూమి, ఎఫ్టీఎల్ పరిధిలో 60.02 ఎకరాలు ఉంది.  ఎస్పీ ఆఫీసు భూమి ఉన్న 671 సర్వే నంబర్ తో పాటు దాని పక్కనే 750, 740 సర్వే నంబర్ల భూములు ఉన్నాయి.  ఎస్పీ ఆఫీస్ కు కేటాయించిన భూమిలో భవన నిర్మాణం చేశారు. కానీ మొత్తం 20 ఎకరాల భూమికి ఎలాంటి సరిహద్దులు ఏర్పాటు చేయకపోవడంతో బీఆర్ఎస్ లీడర్ల కన్ను ఆ స్థలంపై పడింది. 

750 సర్వే నంబర్ భూమిని అడ్డుపెట్టుకొని ఎస్పీ ఆఫీస్ భూములు ఉన్న 671 సర్వే నంబర్ లో  కోట్లాది విలువ చేసే33 గుంటలు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించేశారు. పనిలో పనిగా పక్కనే ఉన్న మరో సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ సైతం చేసుకున్నారు. ఇందుకు ఆనాటి మంత్రి జగదీశ్ రెడ్డి కనుసన్నల్లోనే కబ్జా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 

పేదల భూములు లాక్కొని..

భూములు లేని పేదలకు గత ప్రభుత్వాలు 671 సర్వే నంబర్ లో అసైన్డ్ పట్టాలు ఇవ్వగా.. చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములను జిల్లా అధికారులు గుంజుకుని ఎస్పీ ఆఫీస్ కు కేటాయించారు. దీంతో12 మంది  రైతులు కోర్టుకు వెళ్లగా.. ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. చేసేది లేక బాధిత రైతులు ఆశలు వదులుకున్నారు. అయితే... చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే రూల్స్ ఉంది. కానీ పేదల నుంచి లాక్కున్న శిఖం భూముల్లో ఎస్పీ ఆఫీసు నిర్మించారు. అందులో కొంత భూమిని బీఆర్ఎస్ ఆఫీసుకు,  గౌడ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలకు కూడా ఎకరం చొప్పున మూడెకరాలు కేటాయించారు.

ఎస్పీ ఆఫీస్ ఎదురుగా కబ్జా చేసి వెంచర్ వేసి నిర్మాణాలు చేపడుతున్నా జిల్లా ఆఫీసర్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరో పక్క ఎఫ్టీఎల్ పరిధిలోని 750, 749 సర్వే నంబర్లలో వెంచర్ పర్మిషన్ ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి 671 సర్వే నంబర్ లో బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకొని ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలని నిలిపివేయాలని బాధిత రైతులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.