V6 News

సిక్సర్ల సూర్యవంశీ.. అండర్‌‌-19 ఆసియా కప్‌‌లో 14 సిక్స్లతో విధ్వంసం.. ఇండియా బోణీ

సిక్సర్ల సూర్యవంశీ.. అండర్‌‌-19 ఆసియా కప్‌‌లో 14 సిక్స్లతో విధ్వంసం.. ఇండియా బోణీ
  • 234 రన్స్‌‌ తేడాతో యూఏఈపై ఘన విజయం
  • రాణించిన ఆరోన్‌‌, విహాన్‌‌

దుబాయ్‌‌: వైభవ్‌‌ సూర్యవంశీ (95 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 14 సిక్స్‌‌లతో 171) రికార్డ్‌‌ బ్రేకింగ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో.. అండర్‌‌–19 ఆసియా కప్‌‌లో ఇండియా బోణీ చేసింది. విహాన్‌‌ మల్హోత్రా (69), ఆరోన్‌‌ జార్జ్‌‌ (69) హాఫ్‌‌ సెంచరీలతో అండగా నిలవడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌–ఎ తొలి మ్యాచ్‌‌లో ఇండియా 234 రన్స్‌‌ భారీ తేడాతో యూఏఈపై గెలిచింది. 

టాస్‌‌ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 433/6 స్కోరు చేసింది. అండర్‌‌–19 వన్డేలతో పాటు ఆసియా కప్‌‌ చరిత్రలో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తర్వాత యూఏఈ 50 ఓవర్లలో 199/7 స్కోరుకే పరిమితమైంది. ఉద్ధిష్‌‌ సూరి (78 నాటౌట్‌‌), పృథ్వీ మధు (50) మినహా మిగతా వారు నిరాశపర్చారు. వైభవ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌‌లో ఇండియా.. పాకిస్తాన్‌‌తో తలపడుతుంది. 

14 సిక్స్‌‌లతో..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్‌‌లోనే ఆయుష్‌‌ మల్హోత్రా (4) ఔటైనా.. ఆరోన్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. యూఏఈ బౌలర్లను చితకబాదిన సూర్యవంశీ 14 సిక్స్‌‌లు కొట్టాడు. ఈ క్రమంలో అండర్‌‌–19 స్థాయిలో ఒక ఇన్నింగ్స్‌‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌‌గా రికార్డులకెక్కాడు. 

రెండో ఎండ్‌‌లో ఆరోన్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపించాడు. 30 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కొట్టిన సూర్యవంశీ 52 బాల్స్‌‌లో సెంచరీ మార్క్‌‌ను అందుకున్నాడు. 56 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన ఆరోన్‌‌ రెండో వికెట్‌‌కు 212 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ 28వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన విహాన్‌‌ కూడా వెనక్కి తగ్గలేదు. సూర్యవంశీకి అండగా నిలుస్తూనే చాన్స్‌‌ లభించినప్పుడల్లా ఫోర్లు బాదాడు. మూడో వికెట్‌‌కు 45 రన్స్‌‌ జోడించిన సూర్యవంశీ 171 రన్స్‌‌ వ్యక్తిగత స్కోరు వద్ద 33వ ఓవర్‌‌లో  వెనుదిరిగాడు. 

ఈ క్రమంలో యూత్‌‌ వన్డేలో రెండో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌‌గా నిలిచాడు. అంబటి రాయుడు (177 *) ముందున్నాడు. 2002లో ఇంగ్లండ్‌‌పై రాయుడు ఈ ఘనత సాధించాడు. ఇక 47 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన విహాన్‌‌కు వేదాంత్‌‌ త్రివేది (38), అభిగ్యాన్ కుండు (32 నాటౌట్‌‌), కనిష్క్‌‌ చౌహాన్‌‌ (28) అండగా నిలిచారు. ఈ ముగ్గురు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఇండియా స్కోరును 400లు దాటించారు. యుగ్‌‌ శర్మ, ఉద్ధిష్‌‌ సూరి చెరో రెండు వికెట్లు తీశారు. 

బౌలర్లు అదుర్స్‌‌..

భారీ ఛేదనలో యూఏఈ బ్యాటర్లు ఘోరంగా ఫెయిలయ్యారు. ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నారు. ఫలితంగా ఒక్కటి కూడా భారీ భాగస్వామ్యం నమోదు కాలేదు. ఇన్నింగ్స్‌‌లో ఇద్దరు మాత్రమే హాఫ్‌‌ సెంచరీలు సాధించారు. టాప్‌‌ ఆర్డర్‌‌లో యాయిన్ కిరణ్ రాయ్ (17), షాలోమ్‌‌ డిసౌజా (4), అయాన్‌‌ మిస్బా (3), ముహమ్మద్ రాయన్ (19), అహ్మద్‌‌ కుదాద్‌‌ (0), నురుల్లా అయోబీ (3) నిరాశపర్చారు. 

దాంతో 53 రన్స్‌‌కే ఆరు వికెట్లు కోల్పోయిన యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో పృథ్వీకి జత కలిసిన ఉద్ధిష్ సూరి బ్యాట్‌‌ ఝుళిపించాడు. ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఏడో వికెట్‌‌కు 85 రన్స్‌‌ జోడించి పృథ్వీ వెనుదిరిగాడు. అప్పటికే ఓవర్లు కూడా అయిపోవడంతో యూఏఈకి భారీ ఓటమి తప్పలేదు. దీపేశ్‌‌ 2 వికెట్లు పడగొట్టాడు. 
సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 433/6 (సూర్యవంశీ 171, ఆరోన్‌‌ 69, విహాన్‌‌ 69, యుగ్‌‌ శర్మ 2/75). 

యూఏఈ: 50 ఓవర్లలో 199/7 (ఉద్ధిష్‌‌ సూరి 78*, మధు 50, దీపేశ్‌‌ 2/21).