సుశీలనా? కుల్మాన్ ఘీసింగా? జెన్ జెడ్ ప్రతినిధుల్లో చీలిక.. తేలని నేపాల్ కొత్త ప్రధాని

సుశీలనా? కుల్మాన్ ఘీసింగా? జెన్ జెడ్ ప్రతినిధుల్లో చీలిక.. తేలని నేపాల్ కొత్త ప్రధాని
  • తెరపైకి ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈవో కుల్మాన్​ ఘీసింగ్ పేరు 
  •  ఇప్పటికే రేసులో మాజీ సీజే జస్టిస్ సుశీల కర్కీ
  • రెండు వర్గాలుగా చీలిన జెన్ జెడ్ ప్రతినిధులు
  • ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు పరస్పర దాడులు


ఖాట్మండు: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరనేది తేలలేదు. ఈ విషయంలో జెనరేషన్ జెడ్ ప్రతినిధుల్లో చీలిక వచ్చింది. ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జెన్ జెడ్​గ్రూప్.. తాత్కాలిక ప్రధాని ఎంపికలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది. మొదట ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీల కర్కీనే తాత్కాలిక ప్రధాని అవుతారని ప్రచారం జరిగినప్పటికీ.. తాజాగా ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈవో కుల్మాన్​ ఘీసింగ్​పేరు తెరమీదికి వచ్చింది. ఇంకో వైపు ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా కూడా రేసులో ఉన్నారు. 

కొత్త ప్రధాని ఎంపికపై గురువారం (సెప్టెంబర్ 11) నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్​తో కొందరు జెన్ జెడ్ ప్రతినిధులు చర్చలు జరిపారు. భద్రకాళిలోని ఆర్మీ హెడ్​ క్వార్టర్స్​లో రక్షణ పొందుతున్న పౌడెల్​తో వారు భేటీ అయ్యారు. అక్కడే ఆర్మీ చీఫ్​అశోక్ రాజ్ సిగ్దెల్​తోనూ సమావేశమయ్యారు. ఇంకొందరు జెన్ జెడ్ ప్రతినిధులు.. బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  జెన్ జెడ్ ప్రతినిధులు సుశీల కర్కీ వర్గంగా, కుల్మాన్​ ఘీసింగ్ వర్గంగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

జెన్ జెడ్​లో కొట్టుకున్న రెండు గ్రూపులు  

తాత్కాలిక ప్రధాని ఎంపిక విషయంలో జెన్ జెడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్​గా వ్యవహరించిన సుశీల కర్కీనే ప్రధాని అవుతారని పలువురు ఆర్మీ హెడ్​క్వార్టర్స్​ ముందు నినాదాలు చేయగా..  ఇంకొందరు కుల్మాన్​ ఘీసింగ్​కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు దాడులు చేసుకున్నారు. వారిని ఆర్మీ శాంతింపజేసింది. అనంతరం రెండు వర్గాలు మీడియాకు ప్రకటనలు విడుదల చేశాయి. 

సుశీల కర్కీ అసమర్థురాలని, పైగా ఆమె వయసు 70 ఏండ్లు దాటిందని ఆ వర్గం పేర్కొంది. కర్కీకి తాము మద్దతివ్వడం లేదని.. దేశ భక్తుడైన కుల్మాన్ ఘీసింగ్ వైపు నిలబడుతున్నామని ప్రకటించింది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సీఈవోగా పనిచేసిన 54 ఏండ్ల కుల్మాన్ ఘీసింగ్.. ఇండియాలోని జార్ఖండ్​రాష్ట్రం జెంషెడ్ పూర్​లో ఇంజనీరింగ్​ చదువుకున్నారు. ఒకప్పుడు రోజుకు 18 గంటలు కరెంట్ కోతలతో సతమతమైన నేపాల్​లో కరెంట్​కోతలను కట్టడి చేసిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 

అయితే, సుశీల కర్కీనే తమ ప్రధాని అంటూ జెన్ జెడ్​లోని మరో వర్గం ప్రకటించింది. దేశంలో త్వరలోనే రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని, సమస్యకు పరిష్కారం కనుక్కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్​ తెలిపారు. మరోవైపు ఆర్మీ కూడా.. పలువురు ప్రతినిధులతో చర్చలు జరిపామని, కొలిక్కి రాలేదని పేర్కొంది.  

కర్ఫ్యూ సడలింపు

నేపాల్​లోని పలు ప్రాంతాల్లో గురువారం కర్ఫ్యూను ఆర్మీ సడలించింది. ఖాట్మండు, లాలిత్పూర్​, భక్తపూర్​ జిల్లాల్లో ఆర్మీ భారీగా మోహరించింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి కొంతసేపు.. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కర్ఫూను ఆయా ప్రాంతాల్లో సడలించారు. రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆర్మీ ప్రకటించింది. సడలింపు సమయాల్లో ప్రజలు తమకు అవసరమైన వస్తువుల కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. 

కాగా, నేపాల్  మాజీ ప్రధాని ఝాలానాథ్  ఖనల్  భార్య రబీ లక్ష్మీ చిత్రాకార్  బతికే ఉన్నారు. అల్లర్లలో ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఆమె తన భర్తతో కలిసి కనిపించడంతో ఆ వార్తలన్నీ వట్టివేనని తేలింది.

బార్డర్ లో 60 మంది ఖైదీల పట్టివేత..  

నేపాల్​ జైళ్ల నుంచి ఇప్పటివరకూ 7 వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో భారత్​లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 60 మంది ఖైదీలను భారత సశస్త్ర సీమా బల్ జవాన్లు పట్టుకున్నారు. కాగా, నేపాల్​లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన దాదాపు 150 మంది తిరిగి వచ్చారు.  ప్రత్యేక విమానాల్లో వారిని అధికారులు ఏపీకి తీసుకువచ్చారు.
  
శాంతిని స్థాపిద్దాం: నేపాల్ అధ్యక్షుడు

దేశ ప్రజలంతా శాంతిస్థాపనకు సహకరించాలని నేపాల్​ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ గురువారం విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. నేపాల్​లో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత మంగళవారం నుంచి  కనిపించని ఆయన..  గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్మీ రక్షణలో ఉన్నారు. 

భారత్ తో బంధం బలోపేతం చేస్తాం: సుశీల కర్కీ 

భారత ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని  నేపాల్ మాజీ సీజే సుశీల కర్కీ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్‌‌తో సంబంధాలను బలోపేతం చేస్తానని చెప్పారు. నేపాల్‌‌కు భారత్‌‌తో చారిత్రాత్మక బంధం ఉందని.. ఇండియాపై అపారమైన గౌరవం, ఆప్యాయత ఉన్నాయన్నారు. భారత్‌‌ ఎల్లప్పుడూ నేపాల్‌‌కు సాయం చేస్తూనే వచ్చిందన్నారు. కాగా, సుశీల కర్కీకి ఖాట్మండు మేయర్‌‌‌‌ బాలేంద్ర షా మద్దతు తెలిపారు. ఆందోళనకారులు  ప్రభుత్వ ఏర్పాటులో తొందరపడొద్దని కోరారు. 

రాజ్యాంగాన్ని సవరించాల్సిందే: జెన్ జెడ్  

నేపాల్ పార్లమెంట్​ను రద్దు చేయాలని.. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రాజ్యాంగాన్ని సవరించాలని జెన్ జెడ్ డిమాండ్ చేసింది. నేపాల్​లో ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఈ గ్రూప్.. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. జెన్​ జెడ్​ ప్రతినిధులు దివాకర్​ దంగల్​, అమిత్​ బినియా, జునాల్​ దంగల్​  తదితరులు మాట్లాడారు. జెన్​ జెడ్​ను రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవద్దని హెచ్చరించారు. 

 ‘‘మాది పూర్తిగా ప్రజా ఉద్యమం. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడటమే మా లక్ష్యం. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. ఏ రాజకీయ నాయకులు కూడా జెన్​ జెడ్​లోకి చొరబడటానికి ప్రయత్నించొద్దు” అని తేల్చిచెప్పారు. తాము ప్రభుత్వంలో ఉండబోమని.. కానీ, దేశ భవిష్యత్తు కోసం వాచ్​డాగ్​లా పనిచేస్తామని తెలిపారు. మరోవైపు నేపాల్​లో  పరిస్థితిని సెట్​ చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు  రాంచంద్ర పౌడెల్​తో, ఆర్మీ చీఫ్​ అశోక్​ రాజ్​ సిగ్దెల్​తో జెన్​ జెడ్​ ప్రతినిధులు భేటీ అయ్యారు. కాగా.. ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 34 మంది మరణించినట్లు హెల్త్​ మినిస్ట్రీ ప్రకటించింది. 1,338 మంది వివిధ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారని పేర్కొంది.