దైవ దర్శనానికి వెళ్లిన భక్తులకు అస్వస్థత.. ఒకరి మృతి

దైవ దర్శనానికి వెళ్లిన భక్తులకు అస్వస్థత.. ఒకరి మృతి

బెంగళూరు : దైవ దర్శనానికి వెళ్లొచ్చిన భక్తులు మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 70 మంది ఆస్పత్రిలో చేరారు. శనివారం బెంగళూరులోని హోస్కొటెలోని ఓ ఆలయానికి వెళ్లిన భక్తులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఇవే లక్షణాలతో చికిత్స పొందుతూ ఆదివారం ఆస్పత్రిలో చేరిన  ఓ మహిళ సోమవారం చనిపోయింది. హోస్కొటె చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐదు ఆసుపత్రులలో బాధితులు అడ్మిట్​ అయ్యారని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వీరికోసం ప్రత్యేకంగా ఓ ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించినట్లు ఓ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఆలయంలో తిన్న ప్రసాదం ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని బాధితులు చెబుతున్నారు. అయితే, ఆ ప్రసాదం తినని వారు కూడా ఇవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దీంతో బాధితుల పరిస్థితికి ప్రసాదం కారణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. విచారణ తర్వాతే ఈ ఘటనకు కారణమేంటనే విషయం తెలుస్తుందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఆస్పత్రిలో బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించి ప్రాథమిక విచారణ చేపట్టినట్లు పోలీసులు వివరించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి కంప్లైంట్​కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బాధితుల స్టేట్మెంట్లు, అధికారుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాఫ్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.