
- నల్గొండ జిల్లా చెర్కుపల్లి సర్పంచ్ సస్పెన్షన్
- గ్రామ సభ పెట్టలేదన్నఫిర్యాదు మేరకు చర్యలు
- ఇట్లయితే 4 వేల మంది సర్పంచులకు పదవీ గండం.!
హైదరాబాద్, వెలుగు:సర్కారు కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలను అమలు చేస్తూ.. గ్రామ సర్పంచులపై వేటు వేయడం మొదలు పెట్టింది. గ్రామసభ నిర్వహించలేదనే కారణంతో నల్గొండ జిల్లా కేతెపల్లి మండలం చెర్కుపల్లి గ్రామ సర్పంచ్ చిన బొస్క ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రమంతటా హాట్ టాపిక్‌గా మారింది. హరితహారం మొక్కలు ఎండిపోయినా, కరెంటు బిల్లులు కట్టకపోయినా సర్పంచులు, కార్యదర్శులపై వేటు తప్పదని ఇటీవలే వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్పంచులపై తొలి వేటు పడటం చర్చనీయాంశమైంది.
ఆందోళనలో సర్పంచులు..
కొత్త చట్టం ప్రకారం సర్పంచులు ప్రతి నెలా గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. రెండు నెలలకోసారి గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. సభ జరిగే తేదీ, సమయాన్ని గ్రామంలో టాంటాం వేయించాలి. సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సభను కొనసాగించాలి. గ్రామసభకు కూడా కోరం తప్పనిసరి. అంటే గ్రామంలోని ఓటర్లలో పది శాతం మంది హాజరు కావాలి. ఉదాహరణకు 500 మంది ఓటర్లుంటే కనీసం 50 మంది రావాలి. సమావేశాలు పెట్టకపోతే సర్పంచ్, కార్యదర్శులపై అనర్హత వేటు పడుతుంది. ఈ నిబంధన ప్రకారం సర్పంచ్చినబొస్క ప్రసాద్ పై వేటు వేస్తూ నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సర్క్యులర్ నెం.1391 జారీ చేశారు. అయితే ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు తన నియోజకవర్గంలో పట్టు చాటుకునేందుకు అధికారులపై ఒత్తిడి పెంచి సర్పంచ్‌ను తొలిగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వేధింపులకు వీలుగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తయారైందని, తమను పదవీ గండం వెంటాడుతోందని ప్రతిపక్షాలకు చెందిన సర్పంచులు కలవరపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను చిన్న కారణాలతో తొలగించే నిబంధనలపై మండిపడుతున్నారు.
వేలాది గ్రామాల్లో సభలు పెట్టలే..
ఇప్పటివరకు చాలా గ్రామాల్లో సభలు నిర్వహించలేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులే చెబుతున్నారు. కొత్త చట్టంపై అవగాహన లేకపోవటం, చెక్ పవర్ విషయంలో మూడు నెలల పాటు స్పష్టత లేకపోవటం, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వటంపై నెలకొన్న వివాదం, డిజిటల్ సంతకాల నిబంధనలు వంటివాటితో సర్పంచులు పంచాయతీల కార్యకలాపాలపై దృష్టి పెట్టలేకపోయారని అంటున్నారు. రాష్ట్రంలోని 12,750 గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది జనవరిలో ఎలక్షన్లు జరిగాయి. అందులో నాలుగు వేలకుపైగా గ్రామాల్లో సభలు జరగలేదని అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ ఫిర్యాదులేవీ రానందున చర్యలు తీసుకోలేదని, సభలు నిర్వహించని సర్పంచులు, కార్యదర్శులపై చట్ట ప్రకారం వేటు తప్పదని జిల్లాల్లో పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
రాజకీయ కక్షతోనే..
‘‘గ్రామ సభ నిర్వహించడానికి ఎజెండా తయారు చేయాలన్నా, సభ ఎక్కడ నిర్వహించాలన్నా నిర్ణయం కార్యదర్శి తీసుకోవాలి. నేను గ్రామసభ పెట్టడం లేదని వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. నా తప్పేమీ లేదు. జనాలకు అందుబాటులో ఉంటున్నా.. ఎప్పుడంటే అప్పుడు మీటింగ్ పెట్టిన. ఆ వివరాలను కార్యదర్శి రికార్డుల్లో రాయలేదు. గ్రామసభలు పెట్టానని చెప్పినా నా మాట వినలేదు. కార్యదర్శిపై రాజకీయ ఒత్తిళ్లున్నయి. రెండు నెలలకోసారి లెక్కన జూన్‌లో సభ పెట్టాలె. పెడదామని నేను చెప్పినా కార్యదర్శి వాయిదా వేశారు. ఆమెపై చర్య తీసుకోకుండా నన్ను సస్పెండ్ చేశారు. నా దగ్గర ఆధారాలున్నాయి. ఎమ్మెల్సీ విద్యాసాగర్ ఒత్తిడితో నన్ను బలి చేశారు.
– సి.బి.ప్రసాద్, చెర్కుపల్లి
(సస్పెండైన సర్పంచ్)