11 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

 11 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత
  • పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌‌ ఎత్తివేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్‌‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. లోక్‌‌సభ, రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని వెల్లడించారు. సస్పెండైన అందరు ఎంపీలు బడ్జెట్ సెషన్స్ కు హాజరవుతారని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఒకవేళ సభలో సభ్యులు సహకరించకుండా అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తే మాత్రం.. స్పీకర్ తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా.. గత నెలలో జరిగిన శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన 146 మంది సభ్యులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ఇందులో 132 మంది సభ్యుల సస్పెన్షన్ ఆసెషన్ తోనే ముగిసింది. ఈ నెల 12 న ముగ్గురు లోక్ సభ సభ్యులపై సస్పెన్షన్ ను ప్రివిలేజ్ కమిటీ ఎత్తివేసింది. దీంతో మొత్తం 146 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తేసినట్లైంది. కాగా, పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి.