న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట కారు బాంబ్ పేలుడు కేసుకు సంబంధించి మరో ఫొటో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాహిద్, ముజమ్మిల్ షకీల్ మారుతి సుజుకి బ్రెజ్జా కారును కొనుగోలు చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముజమ్మిల్ షకీల్‌తో పాటు షాహీన్ కారు కీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌ను షోరూమ్‌లో తీసుకుంటున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఈ వాహనాన్ని సెప్టెంబర్ 25న హర్యానాలో కొనుగోలు చేసి రిజిస్టర్ చేశారు.
షాహీన్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ కారును పూర్తిగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ బ్రెజ్జా కారును ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం నుంచి ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు పదార్థాలను తీసుకెళ్లడానికి, బాంబులను అందించడానికి ఈ కారును ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో ఏజెన్సీలు ఇప్పటి వరకు 3 కార్లను స్వాధీనం చేసుకున్నాయి.
2025, నవంబర్ 11న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఓ కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించి సోమవారం (నవంబర్ 17) మరో వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
జమ్మూకాశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ డానిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో డానిష్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాంబ్ పేలుడు కోసం ఉమర్ నబీకి డానిష్ సాంకేతిక సహయం అందించాడని.. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద దాడులకు సహకరించాడని అధికారులు వెల్లడించారు.
