పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్​

పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్​
  • సూర్యాపేట జిల్లాలో ఇద్దరిపై వేటు
  • హరితహారం విధుల్లో నిర్లక్ష్యం వహించారని చర్యలు
  • మంచిర్యాల జిల్లాలో ఒకరికి షోకాజ్
  • ఓడీఎఫ్ పూర్తి చేయకపోతే రిమూవ్ చేస్తామని హెచ్చరిక
  • ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే షాకింగ్ ఉత్తర్వులు

విధుల్లో చేరి మూడు నెలలు కూడా గడవక ముందే ఇద్దరు జూనియర్‌‌ పంచాయతీ కార్యదర్శులకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందాయి. మరో కార్యదర్శికి షోకాజ్​ నోటీసు అందింది. జూనియర్‌‌ పంచాయతీ కార్యదర్శుల విషయమై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ సస్పెన్షన్​ ఉత్తర్వులు, షోకాజ్​ నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ లో సుమారు 8వేల మందికి పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. రెగ్యులర్ పద్ధతిన కాకుండా పనితీరు ఆధారంగా తర్వాత ఏడాదికి సర్వీసును రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇంతవరకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వకపోవటంతో వారు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారు.

విధుల్లో నిర్లక్ష్యం పేరిట..

విధుల్లో నిర్లక్ష్యం చూపారంటూ శనివారం ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌‌ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌‌ అమయ్‌‌ కుమార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. హరితహారం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సస్పెండైనవారిలో మఠంపల్లి మండలం కామాక్షితండా జూనియర్‌‌ పంచాయతీ కార్యదర్శి బి.భరత్‌‌ కుమార్‌‌, అదే మండలంలోని లాల్‌‌ తండా జూనియర్‌‌ పంచాయతీ కార్యదర్శి జి.హరికృష్ణ ఉన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్‌‌ పరిధిలోని కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.అభిలాష్‌‌కు ఓడీఎఫ్‌‌ విషయమై బెల్లంపల్లి సబ్‌‌ కలెక్టర్‌‌ రాహుల్‌‌రాజ్‌‌ షోకాజ్‌‌ నోటీస్‌‌ జారీ చేశారు. ఈ నెల 31 వరకు కన్నెపల్లిలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే ఒకటో తేదీ నుంచి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. విధుల్లో చేరిన మూడు నెలలకే ఇలా సస్పెన్షన్లు, షోకాజులు వెలువడటంపై జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పనితీరు మార్చుకోవాలనే నోటీసులు

వంద శాతం టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయాలని అన్ని పంచాయతీలకు ఆదేశాలిచ్చాం. కొన్ని గ్రామాల్లో 70 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు ఇచ్చాం. ఈ నెల 31 కల్లా టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించాం. లేకపోతే 1వ తేదీ తర్వాత మరోసారి నోటీసులు ఇస్తాం.

రాహుల్ రాజ్ , సబ్ కలెక్టర్ , బెల్లంపల్లి