వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్‌ బహుమతి

స్టాక్‌హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం -2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు పాబోకు నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం దీనిని ప్రకటించింది. 67 ఏళ్ల స్వాంటె పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. స్వాంటె పాబో తండ్రి కార్ల్ సనె బెర్గ్ స్ర్టోమ్ కూడా 1982లో వైద్యరంగంలోనే నోబెల్ బహుమతి అందుకోవడం విశేషం. 

గతేడాది ఉష్ణ గ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి అందుకున్నారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారం రోజులు కొనసాగనుంది. మంగళవారం  భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజు 2022 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.