చెరువుల్ని మింగి సిటీని ముంచుతున్నరు

చెరువుల్ని మింగి సిటీని ముంచుతున్నరు

హైదరాబాద్లోని చెరువులు, కుంటలన్నీ కబ్జా కోరల్లోనే..
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములు కాగితాలకే పరిమితం

హైదరాబాద్, వెలుగు: చారిత్రక నగరమైన హైదరాబాద్కు ఒకప్పుడు లేక్ సిటీగా గుర్తింపు ఉండేది. వేల సంఖ్యలో చెరువులు, కుంటలు ఉండేవి. కానీ ఇప్పుడు చాలా చెరువులు మాయమైపోయాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిశాయి. ఉన్న చెరువులు, కుంటలు కూడా కబ్జాల బారినపడుతున్నాయి. అధికారంలో ఉండే పార్టీల నేతలు, అధికారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఎక్కడికక్కడ ఆక్రమించేస్తున్నారు. నాలాల ఆక్రమణలతో నీళ్లు చెరువుల్లోకి చేరకుండా జనావాసాలను ముంచెత్తుతున్నాయి. చిన్న వానకే కాలనీలు, బస్తీలు మునిగిపోతున్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, మళ్లీ లేక్ సిటీగా మారుస్తామని సర్కారు పెద్దలు చేసిన ప్రకటనలు ఉత్త మాటలుగానే మిగిలిపోతున్నాయి.

ఇప్పుడున్నవి పదో వంతే..
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో ఒకప్పుడు 30వేలకుపైగా చెరువులు ఉండేవి. ఇప్పుడు మిగిలినవి 3,132 మాత్రమే. ఇందులో కోర్ సిటీలో ఉన్న 186 చెరువులను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుండగా.. మిగతా 2,947 చెరువులను ఇన్నర్ ఓఆర్ఆర్, ఔటర్ ఓఆర్ఆర్ గా విభజించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిరక్షిస్తోంది. ఆయా జిల్లాల సర్కారీ సిబ్బంది సాయంతో లేక్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నోటిఫై చేసి ఆయా వెబ్ సైట్లలో ఉంచిన చెరువుల లెక్కలకు.. వాస్తవంగా ఉన్న చెరువుల సంఖ్య, ఎఫ్టీఎల్, బఫర్జోన్లు, ఇతర డేటాకు పొంతన లేదని ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్టులు చెప్తున్నారు. స్థానిక విలేజ్ మ్యాపులు, ఇరిగేషన్ మ్యాపులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను బట్టి చూస్తే.. ఎక్కువ సంఖ్యలో చెరువులు, కుంటలు ఉన్నాయని, కళ్లెదుట ఉన్న చెరువుల డేటా కూడా సర్కారు రికార్డుల్లో లేదని స్పష్టం చేస్తున్నారు.

కోట్లు ఖర్చు చేస్తున్నా..
చెరువుల పరిరక్షణ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఏమాత్రం ఉండట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల బఫర్ జోన్ ప్రాంతమంతా జనావాసాలుగా మారిపోయింది. ఒక్క గట్టి వాన కొడితే చెరువుల పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. తొలిదశలో భాగంగా 40 చెరువులను బ్యూటిఫికేషన్ చేయాలని భావించిన హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ.. కోట్లు ఖర్చు చేసినా, గుర్రపు డెక్కను కూడా తొలగించడం లేదు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు మిషన్ కాకతీయ నిధులు రూ. 283 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినా.. ఏ ఒక్క చెరువు రూపురేఖలు కూడా మారలేదు.

నామ్కే వాస్తేగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ
ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణ కోసం.. మున్సిపల్ శాఖ, అన్ని జిల్లాలు, హెచ్ఎండీఏ, బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఐదేళ్ల కిందే ఏర్పాటు చేశారు. ఏటా సమీక్షించి చెరువుల సంరక్షణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన ఈ కమిటీ.. నామ్కే వాస్తేగా మారిపోయింది. హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న 2,947 చెరువుల్లో.. 2,688 చెరువుల ప్రాథమిక సర్వే పూర్తి కాగా, 150 చెరువుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయినవాటిలోనూ 250 చెరువులను మాత్రమే పూర్తిస్థాయిలో నోటిఫై చేసి హద్దురాళ్లు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించారు.

అక్రమాలు.. ఆక్రమణలు ఎన్నో
రంగారెడ్డి జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న ఐటీ కారిడార్లోని పుప్పాలగూడ ఒకప్పుడు చెరువులకు నిలయంగా ఉండేది. ఇక్కడి ఆరు చెరువులకుగాను ప్రధానమైన బ్రాహ్మణకుంట, మేకసాని కుంట, మామసాని కుంటల బఫర్ జోన్లలో పెద్ద పెద్ద బిల్డింగ్లు వెలిశాయి. దీనిపై స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీని ఆశ్రయించగా.. విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. చెరువు పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించగా.. 6.5 మీటర్ల వెడల్పైన వాటర్ చానల్ ఉన్నట్టుగా గుర్తించారు. కానీ అటు జీహెచ్ఎంసీ, ఇటు హెచ్ఎండీఏ గానీ అసలు ఈ చెరువు ఉందనే విషయాన్నే
గుర్తించలేదు.

నార్సింగి పోలీసు అకాడమీ ఎదురుగా ఏండ్ల కింద నుంచీ ఉన్న చెరువు కూడా హెచ్ఎండీఏ గుర్తించలేదు. దాంతో చెరువు పరీవాహక ప్రాంతంలో యథేచ్చగా భారీ భవనాల నిర్మాణం జరుగుతుంది. చెత్తా చెదారంతో మెల్లగా చెరువు పూడుకుపోతోంది.

112 ఎకరాల విస్తీర్ణమున్న కాప్రా చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో.. వాల్టా, ఎన్విరాన్మెంట్చట్టాలను పక్కనపెట్టి మరీ నిర్మాణాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గణేశ్నిమజ్జనం కోసమంటూ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. దానిపై స్థానికులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. ఇప్పుడు ఇమ్మర్షన్ పాండ్ ను యాంఫీ థియేటర్ గా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు.

రామంతాపూర్ లోని చిన్న చెరువులో వాల్టా రూల్స్కు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు లోకాయుక్తను ఆశ్రయించారు. చెరువు ఎఫ్టీఎల్ భూముల్లో స్థానిక లీడర్లు, అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా.. లోకాయుక్త జూన్ 24న నోటీసులు జారీ చేసింది. అయినా అధికారుల్లో స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.

హైకోర్టు అక్షింతలేసినా..
చెరువుల స్థలాలు కబ్జా కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని చెరువులకే ఫెన్సింగ్ వేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటికే చాలావరకు చెరువుల భూముల్లో 30 నుంచి 50శాతం దాకా కబ్జా అయ్యాయి. ఇట్లా ఆక్రమణలకు గురైన చెరువులపై సర్కారు నిర్లక్ష్యాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టింది. అయినా సర్కారులో, అధికారుల్లో పెద్దగా స్పందన లేదు.

జల వనరులు ధ్వంసమైతున్నయి
ఒకప్పుడు చెరువులు, కుంటలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ సిటీలో మెల్లగా అవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. గ్రామ రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో కనిపించే వివరాలకు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ డేటా బేస్ వివరాలకు పొంతన ఉండటం లేదు. పుల్ ట్యాంక్ లెవల్స్ మార్చి కబ్జాకోరులకు అధికార యంత్రాంగమే సహకరిస్తోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుకూలంగానే సర్కారు పనిచేస్తోంది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణ కంపెనీకి అనుకూలంగా ఉండేలా బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. దీనికోసం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివరాల్లోనూ మార్పులు చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జల వనరులను ధ్వంసం చేస్తున్నారు.
– లుబ్నా సార్వత్, సోల్ మాజీ కన్వీనర్

రియల్ ఎస్టేట్ చెరలో పల్లెచెరువు
రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ పల్లె చెరువు పరీవాహక ప్రాంతం రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువు హద్దులను నోటిఫై చేయలేదు. దీంతో కొందరు అధికారులు, లీడర్లు కుమ్మక్కై పరీవాహక ప్రాంతంలో ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్నారు. వాన నీళ్లు చెరువులోకి చేరవని, భూగర్భ జలాలు తగ్గిపోతాయని.. చెరువును పునరుద్ధరించాలని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సార్వత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఎడుమల కుంట నిండితే రాజ్భవన్ దాకా మునుగుడే..
బంజారాహిల్స్లో ఉన్న జలగం వెంగళ్రావు పార్కులో ఉన్న ఎడుమల కుంట ఒకప్పుడు పెద్ద చెరువుగా, హుస్సేన్ సాగర్కు గొలుసుకట్టుగా ఉండేది. కానీ కాలక్రమంలో దానిచుట్టూ పెద్ద పెద్ద బిల్డింగులు, అర్బనైజేషన్ తో ఓ చిన్న కుంటలా మారిపోయింది. ఆ చెరువును పరిరక్షించాలన్న పర్యావరణవేత్తల ఆందోళనలను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు గట్టి వాన పడితే ఆ చెరువులో చేరాల్సిన నీళ్లన్నీ.. బంజారాహిల్స్ నుంచి సోమాజిగూడ దాకా రోడ్డు పైనే నిలుస్తున్నాయి. రాజ్ భవన్లోనూ నీళ్లు చేరుతున్నాయి.

For More News..

ఈ నెల 28న రాష్ట్ర బంద్

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వర్కర్ల ట్రైనింగ్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన యూఎస్

బురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది