అయోధ్య గర్భగుడిలో.. రాముడిని చూడకుండా.. ఈ పూజారి ముఖం ఎందుకు కప్పుకున్నాడు..!

అయోధ్య గర్భగుడిలో.. రాముడిని చూడకుండా.. ఈ పూజారి ముఖం ఎందుకు కప్పుకున్నాడు..!

అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో.. శ్రీరాముడిని చూడకుండా ఓ పూజారి తన ముఖానికి దుప్పటా కప్పుకున్నాడు.. ఎందుకు ఇలా చేశారు అనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నలు.. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చనీయాంశం అయ్యింది.. ఈ విషయంపై కర్నాటకకు చెందిన ఓ ప్రముఖ పూజారి వివరణ ఇచ్చారు.. అదేంటో తెలుసుకుందాం..

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుక నుండి ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఆసక్తికరమైన ఫొటోలో, ఉడిపికి చెందిన పెజావర్ మఠాధీశ స్వామి విశ్వప్రసన్న తీర్థ అనే పూజారి ఆచారాల సమయంలో తన ముఖాన్ని కప్పుకుని కనిపించారు. గర్భ గుడిలో ఉన్న కెమెరాకు చిక్కిన ఈ సంఘటన..  ఆయనలా ప్రవర్తించడంపై చర్చలకు ప్రేరేపించింది. స్వామి విశ్వప్రసన్న తీర్థ తన ముఖాన్ని కప్పి ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది రాముడికి పవిత్ర నైవేద్యాన్ని సమర్పించే సమయంలో జరిగింది. ఈ చిత్రం స్వామికి దైవంతో ఉన్న లోతైన సంబంధాన్ని, దేవుని పట్ల ఆయనకున్న అత్యంత గౌరవాన్ని సూచిస్తోంది. ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా చూసిన సహనా సింగ్ అనే X యూజర్ తన ఖాతాలో ఈ క్షణం చిత్రాన్ని పంచుకున్నారు. స్వామి విశ్వప్రసన్న తీర్థ చేసిన ఈ పని ప్రాముఖ్యతను ఆమె ఎత్తిచూపారు. ఇది నైవేద్యం సమర్పించినప్పుడు రాముని పట్ల భక్తి, గౌరవానికి సంకేతమని చెప్పుకొచ్చారు.  

ఈ పోస్ట్ పై స్పందించిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలోనూ భగవంతునికి ఆహారాన్ని సమర్పించేటప్పుడు ఇదే తరహా నియమాలు పాటిస్తారని చెప్పారు. ఆహారం కలుషితం కాకుండా వారి ముక్కు, నోటిని కప్పి ఉంచుతారని చెప్పారు.

అయోధ్యలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత పూజలు చేసి హారతి ఇచ్చారు.. ఆ తర్వాత బాల రాముడికి అన్న ప్రసాదంతోపాటు ఇతర ఆహార పదార్థాలు నైవేధ్యంగా పెట్టారు.. ఆ సమయంలోనే ఆ పూజారి ఇలా తన ముఖానికి దుప్పటా కప్పుకున్నాడు. ఇది మధ్వ ఆచారం అంట.. మధ్వ ఆచారంలోనే కాకుండా మిగతా ఆచారాల్లోనూ దేవుడికి నైవేధ్యం పెట్టినప్పుడు కళ్లు మూసుకోవటం లేదా కొన్ని నిమిషాలు గర్భగుడి తలుపులు మూసి వేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. నైవేధ్యం పెట్టిన తర్వాత.. ఆ ప్రసాదాన్ని దేవుడి తింటాడని.. అలా దేవుడు మనం పెట్టే ఆహార పదార్థాలు తింటున్నప్పుడు.. దానిపై నర దిష్టితోపాటు ఇతర ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు.

అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడికి నైవేధ్యాలు సమర్పించారు పూజారులు. ఆ సమయంలో అక్కడే ప్రధాని మోదీతోపాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవటం.. తలుపులు మూయటానికి అవకాశం లేకపోవటంతో.. ఆచారం ప్రకారం ఉడిపి మఠాధిపతి అయిన స్వామి విశ్వప్రసన్న తీర్థ ఇలా చేశారని చెబుతున్నారు పండితులు.