వివేకానందుడి తత్వమే మానవాళికి దిక్సూచి : ఎన్. రాంచందర్ రావు

వివేకానందుడి తత్వమే మానవాళికి దిక్సూచి : ఎన్. రాంచందర్ రావు
  •     ప్రపంచానికి ఆయన చూపిన శాంతి మార్గమే శరణ్యం: ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు పతనమయ్యాయని, కేవలం స్వామి వివేకానంద చూపిన ఆధ్యాత్మిక శక్తి, సామరస్యమే నేటి మానవాళికి దిక్సూచి అని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 164వ జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌‌‌‌లో వివేకానందుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. యుద్ధాలు, అస్థిరతతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి వివేకానందుడు చూపిన శాంతి మార్గమే శరణ్యమన్నారు. 

164 ఏండ్లు గడిచినా ఆయన బోధనలు ఇప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. చికాగోలో చారిత్రక ప్రసంగానికి వెళ్లే ముందు స్వామిజీ సికింద్రాబాద్‌‌‌‌లోని ఈ ప్రాంతంలోనే బస చేశారని, అందుకే ఈ స్థలానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యత ఉందని గుర్తుచేశారు. మరోవైపు, నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘అస్మిత యోగాసన లీగ్’లో పాల్గొని, విజేతలకు రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు బహుమతులు అందజేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కృషితోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. భగవద్గీత పఠనం కన్నా ఫుట్‌‌‌‌బాల్ ఆడటంతోనే దేవుడికి దగ్గరవుతామని వివేకనందుడు చెప్పేవారని, శారీరక దృఢత్వానికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.