నేటికి 128 ఏళ్లు : హైదరాబాద్ లో స్వామి వివేకానంద పర్యటన

నేటికి 128 ఏళ్లు : హైదరాబాద్ లో స్వామి వివేకానంద పర్యటన

హైదరాబాద్: స్వామి వివేకానందకు హైదరాబాద్ తో ఎంతో అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. అయితే చరిత్రాత్మకమైన చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. స్వామీజి హైదరాబాద్ పర్యటనకు నేటితో 128 ఏళ్లు కావడంతో.. ఆ విషయాలను ఓ సార్తి గుర్తు చేసుకుందాం. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను, నిజాం రాజప్రసాదాలను, చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు సహా అనేక దేవాలయాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాం కొలువులో మత విధానాల గురించి చర్చించారు.

ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ది వెస్ట్ పేరుతో జరిగిన సభలో స్వామి వివేకానంద ప్రసంగించారు. యూరోపియన్లతో పాటు సుమారు వెయ్యి మంది ఈ సభకు హాజరయ్యారు. పాశ్చాత్య దేశాలకు తాను వెళ్లడం ఉద్దేశంపై స్వామీజీ ఆంగ్లంలో ప్రసంగించారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలు, హైందవ ధర్మం గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యత, నైతిక ఆదర్శాల గురించి ప్రసంగించిన ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. భారత్‌ను నూతన జవ సత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే తన లక్ష్యాన్ని స్వామీజీ తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వివేకానందుడిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసింది.

హైదరాబాద్ పర్యటన తర్వాత స్వామీజీ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. చికాగోలోని విశ్వవేదికపై హైందవ ధర్మ గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత అమెరికా, యూరప్‌ సహా అనేక దేశాల్లో ఆయన పర్యటించి ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పరిచయం చేశారు.  భారత యువతను తట్టిలేపారు. భారత్‌ను పరమ వైభవ స్థితికి తీసుకెళ్లేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు స్వామి వివేకానంద.