హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు స్వీడన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి అప్లికేషన్లు వస్తున్నాయని స్వీడిష్ ట్రేడ్ కమిషన్ గురువారం ప్రకటించింది. స్వీడన్ ఎంబసీతో పాటు, మెడికవర్ హాస్పిటల్స్‌తో కలిసి మీడియాతో ఈ సంస్థ ఇంటరాక్ట్ అయ్యింది. హెల్త్‌కేర్, ఫార్మా, ఆటోమొబైల్స్, ఐటీ, టెక్ వంటి సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసేందుకు స్వీడన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని స్వీడన్ ట్రేడ్ కమిషనర్ సెసిలియా ఓస్కర్సన్ పేర్కొన్నారు. ఇండియా మొత్తం మీద 260 కంపెనీలు, ఒక్క తెలంగాణలోనే 45 స్వీడన్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. 13 స్వీడన్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్వీడిష్ ట్రేడ్ కమిషన్ బుధవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు గల అవకాశాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికవర్, ఐకియా వంటి స్వీడన్ కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి.
అందుబాటులోకి మరో 3 హాస్పిటల్స్..
హాస్పిటల్ చెయిన్ మెడికవర్ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కొత్తగా మూడు హాస్పిటల్స్‌ను ఓపెన్ చేస్తామని ప్రకటించింది. వరంగల్‌లో 300 బెడ్స్‌తో హాస్పిటల్‌ను ప్రారంభిస్తామని వివరించింది. రాష్ట్రంలో 8 హాస్పిటల్స్‌ను ఆపరేట్ చేస్తున్నామని, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లను కలిపి మొత్తం మీద 24 హాస్పిటల్స్‌ను నడుపుతున్నామని పేర్కొంది. బెంగళూరులో 350 బెడ్స్‌తో ఓ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నామని వివరించింది. తమ ఉద్యోగుల సంఖ్యను 17,000 కు పెంచుకుంటామంది.