
- కనీస సౌలతుల్లేని సిటీ వెల్ఫేర్ హాస్టళ్లు.. శానిటైజేషన్, క్లీనింగ్ మాటే లేదు
- నెర్రెలిచ్చిన గోడలు, మీదపడే పెచ్చులు.. ఎక్కడా కనిపించని కరోనా రూల్స్
హైదరాబాద్, వెలుగు: మెయింటెనెన్స్ సక్కగ లేక వెల్ఫేర్ హాస్టళ్ల లో స్టూడెంట్లు మస్తు గోసపడుతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపడుతుంటే, కొన్ని చోట్ల ఏకంగా ఫ్యాన్లే స్టూడెంట్ల మీద ఊడి పడుతున్నాయి. క్లీనింగ్, శానిటైజేషన్ సరిగ్గా లేక ఏ హాస్టల్లో చూసినా కంపుకొట్లే బాత్రూమ్ లు, కాంపౌండ్ అంతా చెత్తాచెదారమే కనిపిస్తోంది. కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారమే హాస్టల్స్ నిర్వహిస్తున్నామని ఆఫీస్లర్లు చెప్తున్నా ఎక్కడా అవి అమలైతలేవు. ఏ క్షణం నెత్తిమీద ఏం పడుతుందోనని స్టూడెంట్స్ భయం భయంగా ఉంటున్నారు. తిండి కూడా సరిగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్లకు కనీసం డోర్లు కూడా పెట్టడం లేదని.. దారుణమైన పరిస్థితుల్లో చదువుకుంటున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని స్టూడెంట్లు ఆవేద వ్యక్తం చేస్తున్నరు.
98 హాస్టళ్లలో పరిస్థితి ఇదే
హైదరాబాద్లో ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లు 36 ఉన్నాయి. వాటిలో పోస్ట్ మెట్రిక్ (కాలేజీ) 24, ప్రీమెట్రిక్ (స్కూల్) 12 ఉన్నాయి. కాలేజ్ హాస్టళ్లలో లాక్ డౌన్ కంటే ముందు 4,800 మంది ఉండేవాళ్లు. ప్రస్తుతం 1,997 మంది ఉంటున్నరు. స్కూల్స్ హాస్టల్స్ లో 1,200 మందికి ఇప్పుడు 360 మందే ఉంటున్నరు. లాక్ డౌన్కు ముందు అడ్మిషన్ పొందిన వారే ఇప్పుడు రెన్యువల్ చేసుకొని ఉంటున్నారని ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రామారావ్ తెలిపారు. కరోనా రూల్స్ వల్ల ఫుల్ స్ట్రెంత్ తీసుకోలేకపోతున్నాన్నారు. ఎస్టీ వెల్ఫేర్లో కాలేజ్ హాస్టళ్లు పది, స్కూల్ హాస్టళ్లు రెండు, ఆశ్రమ స్కూళ్లకి సంబంధించి రెండు హాస్టల్స్ ఉన్నాయి. లాక్ డౌన్కు ముందు కాలేజ్ హాస్టళ్లలో 1,050 మంది ఉండేవారు. ఇప్పుడు 800 మంది ఉంటున్నారు. స్కూల్ హాస్టల్స్ లో ప్రస్తుతం 60 శాతం స్టూడెంట్స్ ఉంటున్నారని ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ కమలాకర్ అన్నారు. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 12 ప్రీమెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో 630 మంది ఉండేవారు. ప్రస్తుతం 323 మందే ఉంటున్నారు. బీసీ కాలేజీ హాస్టళ్లు 38 ఉన్నాయి. లాక్ డౌన్ కంటే ముందు 5,800 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్లు. ప్రస్తుతం 4850 మంది ఉన్నారు. కరోనా రూల్స్ ప్రకారమే కొత్త అడ్మిషన్లు తీసుకుంటున్నామని, సీట్ల కోసం వస్తున్న స్టూడెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారని బీసీ వేల్ఫేర్ హాస్టళ్ల ఆఫీసర్ ఉదయ్ కుమార్ తెలిపారు.
హాస్టల్లో అన్నీ సమస్యలే
మాది ఆసిఫాబాద్. సికింద్రాబాద్ సర్కార్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. రెన్యువల్ మీద ఫిర్జాదిగూడ బీసీ హాస్టల్లో జాయిన్ అయ్యా. ప్రైవేట్ హాస్టల్ లో ఉండే స్థోమత లేదు. అందుకే గవర్నమెంట్ హాస్టల్ గలీజ్ గా ఉన్నా తప్పట్లేదు. హాస్ట్లో అన్నీ సమస్యలే. గోడలకు పెచ్చులు ఊడి పడుతాయి. నీళ్ల సమస్య. బాత్రూమ్ లు ఘోరంగా ఉంటాయి. ఒక్కో రూమ్ లో ఎక్కువ మంది స్టూడెంట్లను కుక్కుతున్నారు. తిండి కూడా సరిగా ఉండదు.
- సంతోష్ (డిగ్రీ స్టూడెంట్)
మాది నల్గొండ. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్లో సీటొచ్చింది. కాచిగూడలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంటున్న. రూమ్లో ఉండగా ఓరోజు సడెన్ గా సీలింగ్ ఫ్యాన్ ఊడి కాలు మీద పడింది. హాస్పిటల్ వెళ్లి కట్టుకట్టించు కున్నా. ఇంట్లో వాళ్లు అక్కడ ఉండొద్దన్నారు. దీంతో తెలిసిన వాళ్ల రూమ్కు మారాను. హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు. పరిస్థితులు ఘోరంగా ఉండేవి. కరోనా రూల్స్ పాటించేవాళ్లు కాదు.
- మణి, పీజీ స్టూడెంట్