చివరి క్షణాల్లో.. తీపి గుర్తులు

చివరి క్షణాల్లో.. తీపి గుర్తులు

జీవితంలో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్​తో గడిపిన అందమైన జ్ఞాపకాల్ని అప్పుడప్పుడు గుర్తుతెచ్చుకోవడం సహజం. అయితే, చావు దగ్గర పడినప్పుడు జీవితం ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతుందట. ‘ఫ్రాంటియెర్స్​ ఇన్​ ఏజింగ్​ న్యూరోసైన్స్​’ జర్నల్​లో వచ్చిన రీసెంట్​ స్టడీ ఈ విషయం చెప్పింది. చనిపోతున్న వ్యక్తి మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నారు న్యూరోసైంటిస్ట్​లు. అందుకోసం చనిపోతున్న వ్యక్తి మెదడు పనితీరుని స్టడీ చేశారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి.

మూర్ఛ వ్యాధి ఉన్న 87 ఏండ్ల వ్యక్తి మెదడులోని తరంగాల్లోని మార్పుల్ని గమనిస్తున్నారు సైంటిస్ట్​లు. అయితే, అదే టైమ్​లో ఆయనకు హార్ట్​ఎటాక్​ వచ్చింది. దాంతో, చనిపోతున్న వ్యక్తి మెదడు చివరిసారిగా జ్ఞాపకాల్ని గుర్తుచేసే పనిలో ఉంటుందని గుర్తించారు సైంటిస్టులు. ‘‘పేషెంట్​ చనిపోయే 30 సెకన్ల ముందు అతని మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోయింది. కానీ, అతని మెదడు మెమరీస్​ని గుర్తు చేసే పనిలో ఉండడం గమనించారు. ఆ పేషెంట్​ గుండె ఆగిపోయిన 30 సెకన్ల తర్వాత కూడా మెమరీ కలెక్షన్​  జరిగింది.  బహుశా ఎవరికైనా జీవితంలోని ముఖ్యమైన జ్ఞాపకాల్ని ఆఖరిసారి గుర్తు చేసుకొనే ఛాన్స్​ ఇదేనేమో. చనిపోయిన వాళ్లలోనే కాదు చావు అంచు వరకు వెళ్లిన వాళ్ల మెదడులో  కూడా ఇలాగే జరుగుతుంది’’ అని చెప్తున్నాడు అమెరికాలోని లూయిస్​ విల్లే యూని వర్సిటీకి చెందిన న్యూరో సర్జన్​ అజ్మల్​ జెమ్మర్​.