
- సిరిసిల్లలో ఓపెనింగ్‌కు రెడీ అవుతున్న ఐసీయూ బిల్డింగ్, హాస్టల్స్
- రూ.130 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- కరీంనగర్‌లో రెండేళ్లుగా సాగుతున్న పనులు
- మెడికోల రాకపోకలకు బస్సు కష్టాలు
కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మెడికల్ కాలేజీ పనులు చకచక సాగుతుండగా.. కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సిరిసిల్లలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. మెడికోల కోసం నిర్మిస్తున్న హాస్టల్స్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇవి త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ, హాస్టల్స్ నిర్మాణ పనుల తీరు చూస్తే అవి పూర్తవ్వడానికి మరో ఏడాదికిపైగా పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఆఫీసర్ల పర్యవేక్షణ లేమితోనే కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎంబీబీఎస్ విద్యార్థుల క్లాసులు సీడ్ గోడౌన్స్ లోనే మరో ఏడాదిపాటు నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
సిరిసిల్లలో 40 ఎకరాలు... రూ.130 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిరుడు జూలైలో రూ. 130 కోట్లు రిలీజ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామ శివారులోని రెండో బైపాస్‌ను ఆనుకుని 40 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. 4.21 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టారు. 1.08 ఎకరాల్లో బాయ్స్ హాస్టల్, 1.44 ఎకరాల్లో గర్ల్స్ హాస్టల్, 29 గుంటల్లో ప్రిన్సిపాల్ క్వార్టర్స్ నిర్మిస్తున్నారు.
మరో ఆర్నెళ్లలో నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. మరోవైపు కరీంనగర్–జగిత్యాల రోడ్డులో కొత్తపల్లిలో 25 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, హాస్టల్స్ బిల్డింగ్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.138 కోట్లను కేటాయించింది. ఏడాదిలోనే ఈ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాగే నిర్లక్ష్యంగా పనులు చేస్తే మరో ఏడాదైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
కరీంనగర్‌లో మెడికోలకు జర్నీ కష్టాలు
కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొదటి, రెండో బ్యాచ్ ల్లో 100 మంది చొప్పున అడ్మిషన్ పొందారు. ఈ ఏడాది వచ్చే బ్యాచ్ తో విద్యార్థుల సంఖ్య 300కు చేరనుంది. మెడికల్ కాలేజీలో ఇంకా హాస్టల్స్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్‌లో రెండు బ్యాచ్‌లకు చెందిన 84 మంది గర్ల్స్‌కు ఒకేచోట వసతి కల్పించారు. బాయ్స్‌లో ఒక బ్యాచ్‌కు విద్యానగర్‌లో, మరో బ్యాచ్‌కు శ్రీపురంకాలనీలో హాస్టళ్లు ఏర్పాటు చేశారు. వీళ్లకు త్వరలో మరో 100 మంది యాడ్ కాబోతున్నారు.
ఇంత మందికి కలిపి కాలేజీకి వెళ్లేందుకు ఒక మినీ బస్సు మాత్రమే ఉంది. మూడు, నాలుగు ట్రిప్పులు నడిపితేగానీ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి. సెకండియర్ స్టూడెంట్స్ కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌లో ప్రతి రోజు 2 గంటలు ఓపీ చూడాల్సి ఉంది. వీరికి ఉదయం 9 గంటలకే ఓపీ ప్రారంభమవుతుంది. ఫస్టియర్ విద్యార్థులను దింపి.. సెకండియర్ వాళ్ల దగ్గరికొచ్చేసరికి టైం సరిపోవడం లేదు. ఈ ఏదాది నుంచి 200 మంది విద్యార్థులను 9 గంటల్లోపే హాస్పిటల్‌లో దింపాల్సి ఉంటుంది. వచ్చే బ్యాచ్ కోసం మరో బస్సు ఏర్పాటు చేయకపోతే విద్యార్థుల రాకపోకలకు కష్టమయ్యే పరిస్థితి నెలకొంది.