ట్రైన్ జర్నీలో ఇక భోజనం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. రైలు ప్రయాణికులకు ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో తన 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవలను భారీగా విస్తరించింది. గతేడాది కేవలం 70 స్టేషన్లలో ఉన్న ఈ సేవలను ప్రస్తుతం ఏకంగా 152 స్టేషన్లకు చేరుకున్నాయి. అంటే ఏడాది కాలంలోనే 117 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హోలీ స్పెషల్ ఆఫర్లు..
రాబోయే హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 8, 2026 వరకు ప్రయాణికులు సంప్రదాయ పిండివంటలైన గుజియా, పువా, పురాన్ పోలీ వంటి వాటిని నేరుగా తమ సీటు వద్దకే ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా రూ.399 అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ.125 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. యాప్‌లో ప్రత్యేకంగా 'హోలీ సెక్షన్' ద్వారా స్వీట్లు, చాట్స్ బుక్ చేసుకుని ప్రయాణంలోనే ఆస్వాధించొచ్చు.
డేటా ఆధారిత 'ట్రైన్ ఫ్రెండ్లీ' మెనూ
ప్రయాణికుల అభిరుచులను విశ్లేషించి స్విగ్గీ ప్రత్యేకంగా 'ట్రైన్ ఫ్రెండ్లీ డిషెస్' మెనూని రూపొందించింది. కస్టమర్ల హిస్టరీ.. రైలు రూట్లలో ఎక్కువగా ఇష్టపడే 40 రకాల వంటకాలను విశ్లేషించి దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం మొత్తం ట్రైన్ ఆర్డర్లలో 22 శాతం ఈ మెనూ నుండే వస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఉత్తరాన పఠాన్‌కోట్ నుంచి దక్షిణాన తిరునెల్వేలి వరకు, తూర్పున గౌహతి నుంచి పడమరన రాజ్‌కోట్ వరకు ఈ నెట్‌వర్క్ విస్తరించింది.
ALSO READ : సోషల్ మీడియా 'అల్గోరిథం' మాయలో పడుతున్నారా?
చిన్న పట్టణాల్లోనే డిమాండ్ ఎక్కువ
స్విగ్గీ విస్తరణలో మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాల వాటానే ఎక్కువగా ఉందట. మొత్తం 152 స్టేషన్లలో 55 శాతం వాటా టైర్-2, చిన్న పట్టణాలదే. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, తాడేపల్లిగూడెం వంటి స్టేషన్లలో స్విగ్గీ ట్రైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నాగ్‌పూర్, కాన్పూర్, సూరత్, విజయవాడ స్టేషన్లు అత్యధిక ఆర్డర్లతో బిజీగా ఉంటున్నాయి.
స్టేషన్ల వారీగా ఫుడ్ ట్రెండ్స్
ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి అనుగుణంగా భోజనాన్ని ప్లాన్ చేసుకుంటున్నారని స్విగ్గీ డేటా చెబుతోంది. ఇటార్సీ, రత్లాం స్టేషన్లు బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్లలో టాప్‌లో ఉండగా.. కాన్పూర్, భోపాల్, సేలం లంచ్ ఆర్డర్ల డిమాండ్‌లో ముందున్నాయి. ఇక విజయవాడ, నాగ్‌పూర్ స్టేషన్లు డిన్నర్ ఆర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ప్రయాణ సమయంలో వినియోగదారులకు ఆయా నగరాల్లోని బెస్ట్ రెస్టారెంట్ల నుంచి నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు.
