పాండ్యా రీఎంట్రీ అదుర్స్‌.. ఉప్పల్ స్టేడియంలో హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్

పాండ్యా రీఎంట్రీ అదుర్స్‌.. ఉప్పల్ స్టేడియంలో హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్
  • పంజాబ్‌‌‌‌పై 7 వికెట్ల తేడాతో బరోడా గెలుపు

హైదరాబాద్, వెలుగు: టీమిండియా స్టార్ ఆల్‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా కాంపిటేటివ్ క్రికెట్‌‌‌‌లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌‌‌‌లోనే తన బ్యాట్ పవర్ చూపెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో మంగళవారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో పాండ్యా (42 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్‌‌‌‌) పవర్ హిట్టింగ్‌‌‌‌తో తన టీమ్ బరోడాను ఏడు వికెట్ల తేడాతో  గెలిపించాడు. తొలుత ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (19 బాల్స్‌‌‌‌లో 50) మెరుపు ఫిఫ్టీతో విజృంభించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 222/8 స్కోరు చేసింది. అన్‌‌‌‌మోల్‌‌‌‌ప్రీత్ సింగ్ (32 బాల్స్‌లో 69)  కూడా మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌తో బలమైన పునాది వేశారు.

బరోడా తరఫున ఇండియా అండర్–-19 పేసర్ రాజ్ లింబాని (3/36) మూడు వికెట్లు పడగొట్టగా.. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా ఓ వికెట్ తీశాడు.  అనంతరం భారీ టార్గెట్‌‌‌‌ ఛేదనలో బరోడా 19.1 ఓవర్లలోనే 224/3 స్కోరు చేసి గెలిచింది. ఛేజింగ్‌‌‌‌లో హార్దిక్ పాండ్యాకు  బరోడా బ్యాటర్ల నుంచి చక్కటి సహకారం లభించింది. 

శివాలిక్ శర్మ (47 నాటౌట్‌), విష్ణు సోలంకి(41), శాశ్వత్ రావత్(31), కూడా రాణించారు. చివర్లో పాండ్యా పేసర్ అశ్వని కుమార్, ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌‌‌‌లో వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌‌‌‌ను ముగించాడు. తనకే ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్ అవార్డు లభించింది.  ఆసియా కప్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన పోరులోనే ఆకట్టుకున్న పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాలోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. 

పాండ్యా కోసం గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్‌‌‌‌
పాండ్యా, అభిషేక్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండటంతో ఈ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. పోలీసులు ఈస్ట్ స్టాండ్‌‌‌‌ లోకి మాత్రమే  అనుమతించగా.. అది పూర్తిగా నిండిపోయింది. మరో వైపు భద్రత ఉన్నప్పటికీ కొంతమంది గ్రౌండ్‌‌‌‌లోకి దూసుకొచ్చారు. పాండ్యా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తుండగా  ముగ్గురు, నలుగురు ఫ్యాన్స్‌‌‌‌ వేర్వేరు సందర్భాల్లో  అతనికి వద్దకు వచ్చి కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు.