ఐక్యతకు సంకేతం..హనుమాన్ శోభాయాత్ర

ఐక్యతకు సంకేతం..హనుమాన్ శోభాయాత్ర
  • రేపు హనుమాన్ జయంతి

శక్తికి ప్రతి రూపం హనుమంతుడు. ఆరాధన,సేవా గుణానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. రాములవారిని తన గుండెల్లో బంధించుకొని, వానర సైన్యాన్ని కూడగట్టి వారధి నిర్మించిన అపర భక్తుడు. హనుమంతుని గురించి ఆలోచించగానే ముందు గుర్తొచ్చేది ఆయన బలం, ధైర్యం. నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి లక్షణాలు నేటి తరం యువతకు ఆదర్శాలు. ఆంజనేయ స్వామి సంకల్ప శక్తిని, నేటి తరం అందిపుచ్చుకోవాల్సిన మంచి లక్షణాలు తెలియజేసేందుకు బజరంగ్​దళ్​ఏటా‘హనుమాన్​జయంతి’ సందర్భంగా వీర హనుమాన్​విజయయాత్ర చేపడుతోంది.

భాగ్యనగర్ లో నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్రకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. యువతను హనుమంతుడిలా బలమైన, ధైర్యంగల వ్యక్తులుగా నిర్మించడంతోపాటు హిందూ శక్తిని ఏకం చేయడం కోసం ఈ నెల 16న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాయి. 
ఐక్యతకు ప్రతిరూపం..
విశ్వహిందూ పరిషత్ యూత్ వింగ్ అయిన బజరంగ్ దళ్ నిర్వహించే ఈ శోభాయాత్ర హిందూ ఐక్యతకు ప్రతిరూపం.ఈ యాత్రకు దాదాపు ప్రతి ఇంటి నుంచి ఓ కార్యకర్త తన బైకు తీసుకొని, దానికి కాషాయ జెండా కట్టుకొని బయలుదేరుతాడు. ఒక్కొక్కరు ఒక్కో వాన చినుకులా ఇంటి నుంచి బయలుదేరిన కార్యకర్తల సమూహం జడివానలా మారి.. గౌలిగూడ హనుమాన్ దగ్గర పెద్ద ప్రవాహంగా మారుతుంది. గౌలిగూడ హనుమాన్ నుంచి ప్రారంభమై కోఠి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ మీదుగా తాడ్​బండ్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగుతుంది. 
పార్టీలకు అతీతంగా..
బజరంగ్​దళ్ హనుమాన్ యాత్ర అనగానే రాజకీయ పార్టీలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున కదిలి వస్తుంది. హిందూ సంఘటనే లక్ష్యంగా అందరూ ఒక్కటై కదిలి వస్తారు. వివిధ పార్టీల జెండాలు అన్ని తమ తమ ఇంట్లోనే ఉంచి, హనుమాన్ జయంతి ర్యాలీలో మాత్రం కాషాయ జెండాలు ప్రదర్శించడం హిందూ ఐక్యతకు  చిహ్నం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ,  వైఎస్సార్ టీపీ, ఆప్ ఇలా అన్ని ప్రముఖ పార్టీల నాయకులకు బజరంగ్ దళ్ ఆహ్వానం అందజేసింది. దాదాపు లక్ష 26 వేల బైకులు, 6 వేల ఫోర్ వీలర్ లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటాయని అంచనా.

కరోనా కారణంగా గత రెండేండ్లలో వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించలేదు. దీంతో ఈసారి ర్యాలీ పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది.  హనుమాన్ ర్యాలీ కేవలం భాగ్యనగరానికి మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు, పల్లెలు.. తండాల్లో కూడా ర్యాలీలు ఉంటాయి. బజరంగ్​దళ్​కార్యకర్తలు సంప్రదాయం ప్రకారం ఏటా ప్రముఖ స్వామీజీని ర్యాలీకి అతిథిగా ఆహ్వానిస్తారు. ఈసారి బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఈసారి గోరక్ పూర్ పీఠాధిపతి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానించారు.-పి.బాలస్వామి, వీహెచ్​పీ ప్రచార సహ ప్రముఖ్​