- తూతూ మంత్రంగా సమావేశాలు: హరీశ్ రావు
- కేరళలో ఎన్నికల ప్రచారం కోసమే హడావుడిగా ముగింపు
- కావాలనే సభను అర్ధరాత్రి వరకు నడిపారు
- బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి బిల్లులను ఆమోదించుకున్నారని విమర్శ
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్, బిల్లులను పాస్ చేసుకునేందుకు తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శాసనసభను గాంధీభవన్‌లా మార్చేశారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై షార్ట్ డిస్కషన్ కోసం బీఆర్ఎస్ నుంచి నోటీసులిచ్చినా చర్చించలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పకుండా తొండల భాష, కండల భాష వాడారన్నారు.
సీఎం ప్రవర్తించిన తీరు సభానాయకుడి హోదాకు తగినట్టు లేదన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అప్రోప్రియేషన్ బిల్లు రోజు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు, బడ్జెట్ రోజు ప్రశ్నోత్తరాలను ఎత్తేశారన్నారు. ప్రశ్నోత్తరాలు వచ్చినప్పుడైనా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదన్నారు. సభను కావాలనే అర్ధరాత్రి వరకు నడిపి సభ్యులు లేకుండా చూశారని మండిపడ్డారు. సభ్యులు లేని సమయంలో బిల్లులు పాస్ చేసుకున్నారన్నారు. కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30వ తేదీనే ముగించారన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే.. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని, రవీంద్రభారతిలో నాటకాలు వేశారని విమర్శించారు. అవినీతి నుంచి మంత్రిని కాపాడడానికే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండ్రోజుల పాటు సస్పెండ్ చేసి, ప్రతిపక్షం లేకుండా ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి చర్చ లేకుండా ముగించారని, ఇరిగేషన్ పద్దు మీద కూడా కనీస చర్చ లేకుండా పాస్ చేసుకున్నారని మండిపడ్డారు.
రేవంత్లానే మాట్లాడుతున్నడు..
పార్లమెంట్లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అచ్చం రేవంత్ రెడ్డిలాగానే మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్పై బురదజల్లేందుకే కాళేశ్వరంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం పార్లమెంట్ వేదికగా బయటపడిందన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్రమే.
ఇది తెలంగాణకు వరప్రదాయిని అని నితిన్ గడ్కరీ చెప్పారు. తెలంగాణకు ఇది ముక్తేశ్వర ప్రాజెక్టు అని ఆనాటి గవర్నర్ నరసింహన్ కొనియాడారు. కాళేశ్వరం కంటే గొప్ప ప్రాజెక్టు దేశంలో లేదని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు చెప్పారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గోదావరి నదికి నడకలు నేర్పి జీవనదిగా మార్చారు అని ప్రశంసించారని గుర్తుచేశారు.
