- దేశంలోనే ఏకైక ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిజిటల్ వ్యాలెట్: మంత్రి శ్రీధర్ బాబు
- ఐఎంపీఎస్ ద్వారా 90 శాతం నిధుల బదిలీ
- త్వరలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా కొనుగోళ్లు, ఆటో బిల్ పే
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీ-వ్యాలెట్ 2017లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.36 వేల కోట్లకు పైగా లావాదేవీలను జరిపిందని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారిత కొనుగోళ్లు, ఆటోమేటెడ్ బిల్ పేమెంట్ వంటి సేవలను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. టీవ్యాలెట్‌లోని ఇన్‌స్టంట్ మనీ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్ ) గేమ్‌చేంజర్‌గా మారిందని, ఇప్పటివరకు 2.74 కోట్ల ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా రూ.16,765 కోట్లకు పైగా నిధులు తక్షణమే బదిలీ అయ్యాయని, దాదాపు 90 శాతం లావాదేవీలు ఐఎంపీఎస్ ద్వారానే జరిగాయని మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ-వ్యాలెట్‌లో ఇప్పటివరకు 16.14 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. మొబైల్, వెబ్, రాష్ట్రవ్యాప్తంగా 4,500 మీసేవా కేంద్రాలు, 11వేల రేషన్ షాపుల ద్వారా 5.83 కోట్ల లావాదేవీలు జరిగాయి. 1,246 ప్రభుత్వ, పౌర సేవలు ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉన్నాయి. టీ-వ్యాలెట్ కేవలం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ మాత్రమే కాదు.. రాష్ట్రంలో ప్రజలందరికీ ఆర్థిక సేవలు అందించే పారదర్శక పాలనకు నిదర్శనం” అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. త్వరలో యూపీఐ, క్యూఆర్ ఆధారిత కొనుగోళ్లు, ఆటో బిల్ పేమెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ లేని ప్రజలు కూడా మీ సేవ కేంద్రాల ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయగలిగేలా సదుపాయం కల్పించినట్టు మంత్రితెలిపారు. ఈ విధానం పట్టణ-, గ్రామాల మధ్య డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడంలో దోహదపడిందన్నారు. గత ఎనిమిదేండ్లలో టీ-వ్యాలెట్ ఒక విశ్వసనీయమైన సురక్షిత చెల్లింపుల వేదికగా నిలిచిందని, ఐఎంపీఎస్ లావాదేవీలలో 99 శాతానికిపైగా విజయవంతమైన రికార్డు సాధించిందన్నారు. టీ-వ్యాలెట్‌ను నిరంతర ఆవిష్కరణలతో మరింత బలోపేతం చేస్తూ, డిజిటల్ ఇండియా లక్ష్యాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
