గ్రామీణ ఆవిష్కరణలకు టీ వర్క్స్​తో ఊతం : కేటీఆర్

గ్రామీణ ఆవిష్కరణలకు టీ వర్క్స్​తో ఊతం : కేటీఆర్
  • సాఫ్ట్​వేర్​ పవర్​ హౌస్​ ఇండియా.. హార్డ్​వేర్​ సంచలనం తైవాన్​
  • రెండూ కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు
  • టీ వర్క్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ఐటీ అంటే ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇండియా, తైవాన్ కూడా​ అని మంత్రి కేటీఆర్​ అన్నారు. సాఫ్ట్​వేర్​కు ఇండియా పవర్​ హౌస్​ అయితే.. హార్డ్​వేర్​సెక్టార్​లో  తైవాన్​ సంచనాలు సృష్టిస్తోందన్నారు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చని పేర్కొన్నారు. రాయదుర్గంలో నిర్మించిన టీ వర్క్స్​ను గురువారం రాత్రి ఫాక్స్​కాన్​ చైర్మన్​ యంగ్​ల్యూతో కలిసి కేటీఆర్​ ప్రారంభించారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద హార్డ్​వేర్ ప్రొటో టైపింగ్​సెంటర్​అని తెలిపారు.  దీన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామీణ ఆవిష్కరణలకు టీ వర్క్స్​ఊతమిస్తుందన్నారు. దేశానికి ఇంత పెద్ద సెంటర్ ను​అంకితమిస్తుందన్నందుకు గర్వపడుతున్నామన్నారు. వెంటిలేటర్లు, ఎలక్ట్రిక్ ​వెహికల్స్, అగ్రికల్చర్​ కు సంబంధించిన ఎన్నో ఆవిష్కరణలకు టీ వర్క్స్​ అండగా నిలిచిందన్నారు. గ్రామీణ యువత సృజనాత్మక ఆలోచనలకు మరింత పదును పెట్టి వారి ఆవిష్కరణలను సాకారం చేసిన ఘనత టీ వర్క్స్​దే అని చెప్పారు. తెలంగాణలో ఫాక్స్​కాన్​ యూనిట్​స్థాపించి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న యంగ్​ ల్యూకు కేటీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ఈరోజు ఫాక్స్​కాన్​లాంటి సంస్థలతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడం హర్షణీయమన్నారు. ఫాక్స్​కాన్​తో ఈ సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తామన్నారు. అతి చిన్న దేశమైన తైవాన్​ అభివృద్ధిలో ఎక్కడో ఉందని, హైదరాబాద్​ను ఇండియాలో షాంజైన్ గా మార్చగలమన్న​ నమ్మకం తమకు ఉందన్నారు. 

టీవర్క్స్​తో కలిసి పనిచేస్తం: ఫాక్స్​కాన్​ చైర్మన్​ 

గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఈ అభివృద్ధి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఫాక్స్​కాన్ ​చైర్మన్​ యంగ్​ల్యూ అన్నారు. ఇదే వేగంతో పనిచేస్తే నాలుగేళ్లలోనే ఎకానమీ డబుల్​ అవడం ఖాయమన్నారు. టీవర్క్స్​ కాన్సెస్ట్​అద్భుతమైనదని, దీనితో ప్రజలు ఎంతో చేసే అవకాశం ఉంటుందన్నారు. హై ఎండ్​ ఎలక్ట్రిక్​సర్క్యూట్​ బోర్డుల అసెంబ్లింగ్​ కోసం, సర్ఫేస్​ మౌంట్ ​టెక్నాలజీ (ఎస్ఎంటీ)లో టీవర్క్స్​తో  ఫాక్స్​కాన్​ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. టీవర్క్స్​తో దేశంలో పారిశ్రామిక విప్లవానికి పునాది వేశామని టీవర్క్స్​ సీఈవో సుజయ్ ​కారంపూడి అన్నారు. ఇది ఒక బిల్డింగ్​ మాత్రమే కాదని, 60 సభ్యులతో కూడిన స్ట్రాంగ్ ​టీం తమ సొంతమన్నారు. 300కు పైగా స్టార్టప్స్​ టీ వర్క్స్​తో కలిసి పనిచేస్తున్నాయని ఐటీ శాఖ ​ప్రిన్సిపల్​సెక్రటరీ జయేశ్​రంజన్​ తెలిపారు. కాగా, టీ వర్క్స్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్​ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.