ముంబై: మెన్స్ టీ20 వరల్డ్ కప్–2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. గ్రూప్–బిలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్.. గ్రూప్–సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.. గ్రూప్–డిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ ఉన్నాయి.
ఇండియాలో ఐదు వేదికలు (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు (క్యాండీ, కొలంబోలో రెండు) వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 7న అమెరికా (ముంబై)తో టోర్నీని మొదలుపెట్టనున్న టీమిండియా.. 12న నమీబియా (ఢిల్లీ)తో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థులైన ఇండో-–పాక్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. 18న నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)తో ఆడనుంది.
నాలుగు గ్రూప్‌ల్లో టాప్–2లో నిలిచిన జట్లు సూపర్–8కు అర్హత సాధిస్తాయి. సూపర్–8 గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు వెళ్తాయి. మార్చి 4న జరిగే తొలి సెమీస్‌కు కోల్‌కతా లేదా కొలంబో ఆతిథ్యమివ్వనుంది. 5న రెండో సెమీస్ ముంబైలో జరుగుతుంది. 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మెగా టోర్నీకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు.
