కోల్‌కతా: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న వెస్టిండీస్.. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అజేయంగా సూపర్–8 రౌండ్ కు సిద్ధమైంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ షై హోప్ (46 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75) రాణించగా, బౌలింగ్‌లో షమార్ జోసెఫ్ (4/30), మాథ్యూ ఫోర్డ్ (3/19) చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 42 రన్స్ తేడాతో ఇటలీపై గెలిచింది. టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 165/6 స్కోరు చేసింది. రెండో ఓవర్‌లోనే బ్రెండన్ కింగ్ (4) ఔట్ కాగా, హోప్ నిలకడగా ఆడాడు.
వన్ డౌన్‌లో హెట్‌మయర్ (1) కూడా ఫెయిల్ కావడంతో కరీబియన్ జట్టు 31/2తో నిలిచింది. ఈ దశలో హోప్‌కు తోడైన రోస్టన్ ఛేజ్ (24) మెరుగ్గా ఆడాడు. ఈ ఇద్దరు కలిసి ఇటలీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. 28 బాల్స్‌లో హోప్ హాఫ్ సెంచరీ చేయగా, మూడో వికెట్‌కు 64 రన్స్ జత చేసి ఛేజ్ వెనుదిరిగాడు. తర్వాత ఐదు బాల్స్ తేడాలో రోవ్‌మన్ పావెల్ (9), హోప్ ఔటైనా.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (24 నాటౌట్) దూకుడుగా ఆడాడు.
హోల్డర్ (9)తో కలిసి ఆరో వికెట్‌కు 22 రన్స్ జోడించాడు. చివర్లో మాథ్యూ ఫోర్డ్ (16 నాటౌట్) ధనాధన్ షాట్లతో రెచ్చిపోవడంతో విండీస్ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది. బెన్ మనెటీ, క్రిషాంగ్ కలుగమాగే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇటలీ 18 ఓవర్లలో 123 రన్స్‌కే ఆలౌటైంది.
బెన్ మనెటీ (26) టాప్ స్కోరర్. ఆరంభం నుంచే విండీస్ బౌలర్లు జోసెఫ్, ఫోర్డ్, గుడకేశ్ మోతీ (2/24) లైన్ అండ్ లెంగ్త్‌తో ఇటలీ బ్యాటర్లను కట్టడి చేశారు. మధ్యలో జేజే స్మిత్ (24), ఆంథోనీ మోస్కా (19), గ్రాంట్ స్టివార్ట్ (12) పోరాడినా సక్సెస్ కాలేదు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో ఇటలీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
