మత్తు కోసం టాబ్లెట్లు.. ఇంజక్షన్లు

మత్తు కోసం టాబ్లెట్లు.. ఇంజక్షన్లు
  •      ఇద్దరు యువకులు, ఫార్మసీ యజమాని అరెస్ట్​.. డ్రగ్స్​ సీజ్​ 

నల్గొండ అర్బన్​, వెలుగు:  నల్గొండలో యువత కొత్త తరహా డ్రగ్స్​ వాడుతున్నారు. డాక్టర్​ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే ప్రమాదకరమైన మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు  తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.  ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని  విచారించారు. వారికి  స్పాస్మో ప్రాక్సివాస్‌ ప్లస్, అల్ట్రాకింగ్‌ టాబ్లెట్లు,  ట్రామాడెక్స్‌ ఇంజక్షన్లు అమ్మిన వారిని అరెస్టు చేసి డ్రగ్స్ ​స్వాధీనం చేసుకున్నారు.  ఎస్పీ చందనాదీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ లోని   రహ్మాన్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌జబీఉల్లా, ఎన్‌జీ కాలేజీ సమీపంలోని శ్రీనగర్‌కాలనీ చెందిన మహ్మద్‌సల్మాన్‌ మత్తు మందులతో పట్టుబడ్డారని, వారు  శివాజీనగర్‌లోని న్యూ హెల్త్‌కేర్‌ ఫార్మసీ  యజమాని తౌడోజు నరేశ్​ దగ్గర  వాటిని  కొన్నారని ఎస్పీ  చెప్పారు.

వారిని అరెస్టు చేసి డ్రగ్స్​ సీజ్​ చేసినట్టు చెప్పారు. కొందరు యువకులు మత్తు టాబ్లెట్లను, ఇంజక్షన్లను సొంతంగా వినియోగించడమే కాకుండా  ఇతరులకు కూడా అమ్ముతున్నారని  తెలిపారు.   మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని,  వాటిని వాడేవారిపైనా.. అమ్మే వారిపైనా  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్​కు సంబంధించి   సమాచారాన్ని  సమీప పోలీస్‌స్టేషన్‌కు గానీ, డయల్‌100  కు గానీ  తెలియజేయాలని కోరారు.  వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.