ఢిల్లీ తబ్లిగి కోసం 3 నెలల ముందే సెలక్షన్స్

ఢిల్లీ తబ్లిగి కోసం 3 నెలల ముందే సెలక్షన్స్

రెండేండ్లకోసారి తబ్లిగి మీటింగ్
ఢిల్లీ మర్కజ్ నుంచి ఆహ్వానం కొందరికే.. వెళ్లింది వేల మంది
చాలా మంది సొంత ఖర్చులతోనే ఢిల్లీకి
వసతి, భోజనం మాత్రం ఉచితం
తెలంగాణ, ఏపీలకు తబ్లిగి సెంటర్ గా హైదరాబాద్

హైదరాబాద్, వెలుగు: జమాతే తబ్లిగి, మర్కజ్.. దేశవ్యాప్తంగా నాలుగైదురోజులుగా బాగా చర్చ జరుగుతున్న అంశం. కరోనా కంట్రోల్లోనే ఉందన్న సమయంలో ఒక్కసారిగా వందల సంఖ్యలో కేసులు పెరిగిపోవడం, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బాధితులు ఉండటంతో ఆందోళన పెరిగిపోయింది. మర్కజ్ లో జమాత్ తబ్లిగి ముందస్తు ఆహ్వానం మేరకు రాష్ట్రం నుంచి 1,030 మంది ప్రతినిధులు వెళ్లగా.. వారిలో 930 మందిని ట్రేస్ చేశారు. మరో వంద మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే ఆహ్వానం లేకపోయినా అనధికారికంగా వెళ్లిన వారు వందల సంఖ్యలోనే ఉన్నారని అంచనా వేస్తున్నారు. వారి వివరాలు మత పెద్దల వద్ద కూడా లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వారిని ఎలా ట్రేస్ చేయాలన్నది తలనొప్పిగా మారింది.

మర్కజ్ సెలక్షన్స్ ఇలా..
జమాత్ తబ్లిగి ఆధ్యాత్మిక సమ్మేళనాలు రెండేళ్లకోసారి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్లో ఉన్న మర్కజ్ మసీదులో జరుగుతుంటాయి. జమాత్ జరిగే తేదీలను రెండేళ్లముందే నిర్ణయిస్తారు. దానికి హాజరయ్యే ప్రతినిధుల ఎంపిక మూడు నెలల ముందు మాత్రమే జరుగుతుందని ఇటీవల ఢిల్లీ ప్రారనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ఒకరు చెప్పారు. మసీదు పెద్దలు మత ప్రచారం కోసం పని చేయాలన్న ఆసక్తి ఉన్న వారిని జిల్లాల వారీగా ఉన్న ముస్లింల జనాభాను బట్టి సెలెక్ట్ చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మర్కజ్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మర్కజ్ కు వెళ్లొచ్చేందుకు ఖర్చులను ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. అక్కడ భోజనం, వసతి మాత్రం జమాత్ తబ్లిగి నిర్వాహకులు కల్పిస్తారు. 2019 డిసెంబర్లో మర్కజ్ కు వెళ్లే ప్రతినిధుల ఎంపిక జరిగినట్టు తెలిసింది. మన రాష్ట్రం నుంచి 1,030 మందిని, ఏపీ నుంచి 1,085 మందిని ఎంపిక చేశారు. కానీ ఢిల్లీ చూడాలని, మత గురువుల బోధనలు వినాలన్న కోరికతో ఒక్కో జిల్లాకు ఇచ్చిన కోటాకు మించి అనధికారికంగా రెండింతల మంది వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చాలా మంది జనరల్ బోగీల్లో, రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో ప్రయాణించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించగా.. తమతోపాటు మరో ముగ్గురు వచ్చారని, వారి అడ్రస్ తమకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. అలాంటి వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.

ఐదేళ్ల క్రితం హైదరాబాద్లో..
జమాత్ తబ్లిగి సభలు ఐదేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగాయి. బాలాపూర్‌‌‌‌‌‌‌‌లో 2015 నవంబర్ 21,22,23 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది ముస్లింలు హాజరయ్యారు. సమావేశం జరిగే ప్రాంతంలో నిరంతరం మంచినీరు, టాయిలెట్లు, కరెంటు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే అప్పట్లో ఏర్పాట్లు చేసింది. 500 మంది పోలీసులతో బందోబస్తు పెట్టింది. ఆ టైంలో చలితీవ్రత ఉండడంతో సమావేశానికి వచ్చిన వారు 3 రోజుల పాటు ఉండేందుకు వీలుగా సమావేశ మందిరం, తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు.

మత పునరుజ్జీవమే జమాత్ లక్ష్యం
హర్యానాలోని మేవాట్లో 1927లో మహమ్మద్ ఇలియాస్ అల్ కంధ్లావి అనే మత గురువు జమాత్ తబ్లిగి సంస్థను స్థాపించారు. ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సున్నీ ఇస్లామిక్ మిషనరీగా ఆవిర్భవించిన ఈ సంస్థ ఇస్లాం మత పునరుజ్జీవం కోసం పనిచేస్తోంది. ముస్లింలు ఇతర మతాల్లోకి వెళ్లకుండా చూడడమే సంస్థ లక్ష్యం. కలిమా (అల్లాపై విశ్వా స ప్రకటన), సలాహ్ (నమాజ్), ఇల్మ్ ఓ జిక్ర్ (జ్ఞానం), ఇక్రమ్-ఏ–ముస్లిం (తోటిముస్లింలపై గౌరవం), ఇఖ్లాస్ –ఏ–నియత్ (ఇస్లామిక్ ఆదర్శాల కోసం అంకితం కావడం), దావత్ -ఓ-టేబెగ్(మతాంతీకరణ) అనే ఆరు సూత్రాలను ఆచరించాలని ఈ సంస్థ తన సభ్యులకు సూచిస్తుంది. రోజూ ఐదు పూటలా నమాజ్‌‌‌‌‌‌‌‌ చేయడం, నమాజ్‌‌‌‌‌‌‌‌ చదవని వారిని చదివేలా ప్రోత్సహించడం, నమాజ్‌‌‌‌‌‌‌‌ అంటే ఏమిటో సరిగా తెలియని ముస్లింలు ఉన్న గ్రామాల వారిని జమాత్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి ఎలా చేయాలో, చదవాలో నేర్పించడం, మసీదులు లేని ఊర్లలో చందాలు వసూలు చేసుకుని నిర్మించుకునేలా చూడటం వంటివి తబ్లిగి పెద్దలు బోధిస్తుంటారు.

For More News..

కరోనా వల్ల జాబ్ పోయిందా.. అయితే ఇవిగో 12 వేల జాబ్స్ రెడీ

కరోనాకు ముందు.. తర్వాత..

ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు