
తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో నిజమాబాద్ జిల్లా రెంజల్ మండల తహసీల్దార్ కన్నీరు పెట్టుకున్నారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని 309 ఎకరాల వక్ఫ్ భూములను 127 మంది రైతులకు… 40 ఏళ్ల క్రితం ఇనాం ఇచ్చారు. రెండెళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూములన్ని తిరిగి వక్ఫ్ బోర్డుకి చేరాయి. దీంతో ఆగ్రహించిన కందకుర్తి రైతులు… తమకు న్యాయం చేయాలని జిల్లా, డివిజన్ , మండల రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశం తమ పరిధిలో లేదని జిల్లా రెవిన్యూ అధికారులు చెప్తున్నా… రైతులు వినడం లేదు. రెండు రోజులుగా వివిధ రూపాల్లో తహసీల్దార్ అసదుల్లాఖాన్ పై రైతులు ఒత్తిడి పెంచారు. వారికి సమాధానం చెప్పలేక ఎమ్మార్వో కంటతడి పెట్టారు. ఈ భూముల విషయం తేల్చాల్సింది వక్ఫ్ బోర్డేనని , తన పరిధిలో లేదని ఆయన వివరణ ఇచ్చారు.