స్పీడ్​గా పాలమూరు పనులు... ఈ ఏడాది నుంచే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు

స్పీడ్​గా పాలమూరు  పనులు... ఈ ఏడాది నుంచే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు
  • ఏడెనిమిది నెలల్లో కరివెన వరకు అన్ని పనులూ పూర్తి చేసేలా టార్గెట్​
  • నార్లాపూర్​ నుంచి   ఏదులకు నీళ్లు తీసుకెళ్లే కెనాల్​ పనులు స్పీడప్​

హైదరాబాద్​, వెలుగు: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను సర్కారు వేగవంతం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడెనిమిది నెలల్లో ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కరివెన వరకు రిజర్వాయర్లు, కాల్వల పనులను పూర్తి చేయాలని డిసైడ్​అయింది. అందుకు అనుగుణంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన డెడ్​లైన్​కు అనుగుణంగా.. అధికారులు ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు.  నార్లాపూర్​ రిజర్వాయర్​ వరకు నీటిని నింపుకుంటే.. 40 నుంచి 50 టీఎంసీల నీటిని ఈ ఏడాది నుంచే నిల్వ చేసుకోవడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.

 కరివెన రిజర్వాయర్​కు సంబంధించి ఓ చిన్న సమస్య ఉండగా.. దానినీ వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకుంటే.. వట్టెం వరకు నీటిని నింపుకున్నా.. 30 నుంచి 40 టీఎంసీల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కరివెన వరకు రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే 2,84,094 ఎకరాల ఆయకట్టు (వట్టెం కింద 1,33,000 ఎకరాలు, కరివెన కింద 1,51,094 ఎకరాలు)కు నీళ్లివ్వడానికి వీలవుతుందని చెబుతున్నారు. వాటితోపాటు నార్లాపూర్​, ఏదుల కింద 50 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్యాకేజీ 3 పనులు స్పీడప్​

నార్లాపూర్​ నుంచి ఏదుల రిజర్వాయర్​కు నీళ్లు తరలించేందుకు 8.32 కిలోమీటర్ల పొడవైన కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. ప్యాకేజీ 3లో భాగంగా చేపట్టిన ఈ పనులు.. సగానికిపైగా కాల్వను తవ్వారు. అయితే, భారీ బండరాయి అడ్డుపడడంతో మరో 3.5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. పనులను చేపట్టిన నిర్మాణ సంస్థ ఆ పనులనూ నత్తనడకన సాగిస్తున్నది. కంట్రోల్​ బ్లాస్టింగ్​కు మరిన్ని నిధులు కావాలని డిమాండ్​ చేస్తున్నది. ఇటీవలే అందుకు అయ్యే ఖర్చుపై అధికారులు ఎస్టిమేషన్​ను పెంచారు. అయినా కూడా సంస్థ పనులను ముందుకుసాగనివ్వడం లేదు. కొద్ది రోజుల క్రితమే జీవో రావడంతో.. కంట్రోల్​ బ్లాస్టింగ్​కు అవసరమయ్యే సామగ్రి, యంత్రాలను తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తున్నదని అధికారులు చెబుతున్నారు. 

15 రోజుల్లోగా యంత్రాలు, పరికరాలు వస్తాయని అంటున్నారు. అవి రాగానే పనులు వేగంగా ముందుకు కదులుతాయని చెబుతున్నారు. అప్పటివరకు పలుచోట్ల ఎక్స్​కవేటర్లు, ట్రాక్టర్లతో డ్రిల్లింగ్​ చేస్తూ పనులను మొదలుపెట్టారు. వాటి సంఖ్య కూడా పరిమితంగానే ఉన్నది. ప్రభుత్వం పెట్టిన డెడ్​లైన్​ను అందుకునేందుకు వీలుగా.. 4 నెలల్లో ఈ పెండింగ్​ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. ఒక నెల అటో ఇటో పనులను కచ్చితంగా పూర్చి చేసి ఏదులకు నీటిని తరలించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. 

కరివెనలో చిన్న సమస్య..

కరివెన రిజర్వాయర్​కు సంబంధించి అన్ని పనులూ పూర్తయినప్పటికీ.. కాల్వకు కీలకమైన వయాడక్ట్​తో సమస్య ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వయాడక్ట్​కు కేవలం 2 ఎకరాల భూసేకరణ సమస్యగా మారిందంటున్నారు. అది కోర్టులో ఉందని, దానిని పరిష్కరించుకుంటే వయాడక్ట్​ సమస్య తీరుతుందని చెబుతున్నారు. ఇటు నిరుడు సెప్టెంబర్​లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్​హౌస్​ మునిగిపోయింది. దీంతో అందులో బిగించిన 4 మోటార్లు దెబ్బతిన్నాయి. 

ఇప్పుడు ఆ 4 మోటార్లకూ రిపేర్లు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 10 మోటార్లుండగా.. 4  మోటార్లు సిద్ధమయ్యాయి. మరో మోటార్​ నిర్మాణ దశలో ఉన్నది. అది కూడా త్వరలోనే పూర్తి చేసి, 5 పంపుల ద్వారా నీటిని ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్ధండాపూర్​ రిజర్వాయర్​తోనే కొంత సమస్య ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ భూసేకరణ సమస్య తీరలేదు. రూ.800 కోట్లు అవసరం ఉండడంతో.. ఇప్పటికే అందులో  రూ.72 కోట్ల మేర భూసేకరణ పరిహారం విడుదల చేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పనులు మొదలవుతున్నాయని, దానికో ఏడాదిన్నర సమయం దాకా పట్టే అవకాశం ఉందని అంటున్నారు. 

ఐదు రిజర్వాయర్లు.. 60 టీఎంసీలు..

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 5 రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నార్లాపూర్​ నుంచి ఎత్తిపోతలు మొదలవుతాయి. నార్లాపూర్​, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్​ల వద్ద రిజర్వాయర్లను నిర్మించి 9 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నార్లాపూర్​ను 6.4 టీఎంసీలు, ఏదుల రిజర్వాయర్​ను 6.55 టీఎంసీలు, వట్టెం రిజర్వాయర్​ను 16.74 టీఎంసీలు, కరివెనను 19 టీఎంసీలు, ఉద్ధండాపూర్​ను 16.03 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ5 రిజర్వాయర్ల సామర్థ్యం కలిపితే 64.72 టీఎంసీలుగా ఉంది.