తహసీల్దార్ల ఆందోళన బాట

తహసీల్దార్ల ఆందోళన బాట

తహసీల్దార్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తమను ఇన్ని రోజులైనా తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు వెంటనే చేపట్టాలని కోరుతూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌‌ సర్వీసెస్‌‌ అసోసియేషన్‌‌ (ట్రెసా) నాయకత్వం అన్ని జిల్లాల కమిటీలకు పిలుపునిచ్చింది. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఆ తర్వాత వర్క్‌‌ రూల్‌‌(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేసేలా) పాటించి నిరసన తెలపాలని భావిస్తున్నారు. దానికీ స్పందన రాకుంటే సామూహిక సెలవులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఎన్నిసార్లు విన్నవించినా..

ఎన్నికలకు ముందు ఒకే చోట మూడేళ్ల సర్వీస్‌‌ను పూర్తి చేస్తున్న తహసీల్దార్లను సుదూర జిల్లాలకు కూడా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌‌ ముగియగానే రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రెటరీకి మూడుసార్లు వినతిపత్రాలు సమర్పించారు. తర్వాత ఎనిమిది సార్లు ఓరల్‌‌గా కలిసి విన్నవించారు. ఫ్యామిలీ ఒక చోట, కొలువు మరో చోట చేస్తుండటంతో ఎదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు రేపు, మాపు అంటూ దాటవేస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడి శాఖ విధులతోపాటు ఎన్నికల విధులు నిర్వర్తించిన తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటున్నారు.