కొత్తగూడెం సీఈపై చర్యలు తీసుకోండి

కొత్తగూడెం సీఈపై చర్యలు తీసుకోండి
  •  ఇరిగేషన్ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ అనుమతులు లేకుండా సీతమ్మ సాగర్​మల్టీ పర్పస్​ప్రాజెక్టు పనులు చేపట్టిన కొత్తగూడెం సీఈపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ సైటింస్ట్​డాక్టర్​సౌరభ్​ఉపాధ్యాయ్ ఇటీవల ఇరిగేషన్​శాఖ సెక్రటరీకి ఈ మేరకు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు పనులకు బాధ్యుడైన కొత్తగూడెం సీఈపై చర్యలు తీసుకునేలా చూడాలని, తీసుకున్న చర్యల సమాచారం తమకు అందజేయాలని తెలంగాణ పొల్యూషన్​కంట్రోల్​బోర్డు మెంబర్​సెక్రటరీకి మరో లేఖ రాశారు.

 పర్యావరణ అనుమతులు లేకుండానే సీతమ్మ సాగర్​మల్టీపర్పస్​ప్రాజెక్టు పనులు చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తెల్లం నరేశ్​తో పాటు మరికొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. సీతారామ లిఫ్ట్​స్కీంలో అంతర్భాగంగా ఈ ప్రాజెక్టును చూపించి తెలంగాణ పర్యవరణ అనుమతులు పొందే ప్రయత్నం చేయగా దానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్​పర్ట్​అప్రైజల్​కమిటీ (ఈఏసీ) ససేమిరా అంది. సీతమ్మసాగర్​కు విడిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. 

ఎన్జీటీ సైతం ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఇరిగేషన్​ఇంజనీర్లు సీతమ్మ సాగర్ పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. సీతమ్మ సాగర్​పనులను వెంటనే నిలిపి వేయడంతో పాటు ఈ పనులకు బాధ్యుడైన ప్రాజెక్టు అథారిటీ (కొత్తగూడెం) సీఈపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​చర్యలు తీసుకున్నాదో లేదో పరిశీలించి తమకు సమాచారం ఇవ్వాలని పొల్యూషన్​కంట్రోల్​బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు.