కేటీఆర్, సిటీ మేయర్​పై చర్యలు తీస్కోండి : కాంగ్రెస్​ నేతలు

కేటీఆర్, సిటీ మేయర్​పై చర్యలు తీస్కోండి : కాంగ్రెస్​ నేతలు

హైదరాబాద్​, వెలుగు: అంబర్​పేట్​లో నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేసి చంపేసిన ఘటనపై బుధవారం కాంగ్రెస్​ పార్టీ నేతలు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కంప్లయింట్​ చేశారు.  రాష్ట్ర సర్కారు, మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి, కమిషనర్​లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.  ఘటనపై మంత్రి కేటీఆర్, మేయర్​ విజయలక్ష్మి బాధ్యతారహిత కామెంట్లు చేశారని ఆరోపించారు. ‘షేమ్​ కేటీఆర్​.. షేమ్​ మేయర్​’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కల బెడదకు పరిష్కారం చూపలేని మంత్రి అసమర్థతకు ఆ కామెంట్లే నిదర్శనమన్నారు. కుక్కలకు ఆకలి వేయడం వల్లే దాడులు చేస్తున్నాయని మేయర్​ అనడం దారుణమని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత కామెంట్లతో మానవ హక్కులను కాలరాశారని ఆరోపించారు.

వెంటనే కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. కార్ల రేస్​ మీద ఫోకస్​ పెడుతున్న మంత్రి కేటీఆర్ కు తన​శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకొనే తీరిక కూడా లేదా? అని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్ నిలదీశారు. హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలుడి మృతిపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని విమర్శించారు. మేయర్​పదవికి విజయలక్ష్మి పనికిరారని మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. బాలుడి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారిం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నీలిమ, ఫిరోజ్​ ఖాన్, కల్వ సుజాత, మెట్టు సాయికుమార్​ తదితరులు పాల్గొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఆఫీసులోనూ కాంగ్రెస్​ నేతలు కంప్లయింట్​చేశారు. ఘటనకు బాధ్యత వహించి మేయర్​ రాజీనామా చేయాలని జీహెచ్​ఎంసీలో కాంగ్రెస్​ఫ్లోర్​లీడర్​ధర్పల్లి రాజశేఖర్​ డిమాండ్​ చేశారు.