అక్రమ నిర్మాణాలు సాగనియ్యద్దు

అక్రమ నిర్మాణాలు సాగనియ్యద్దు
  • హెచ్‌‌ఎండీఏ పర్మిషన్లు లేకుంటే చర్యలు తీస్కోవాలె
  • ఫీల్డ్ విజిట్ చేసి నిర్మాణాలను పరిశీలించాలె
  • అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలపై రిపోర్టివ్వాలె
  • మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్‌‌ శాఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పర్మిషన్‌‌‌‌ లేకుండా నిర్మిస్తున్న భవనాలు, అపార్ట్‌‌‌‌మెంట్లు, గేటెడ్‌‌‌‌ కమ్యూనిటీలు, లే ఔట్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత కమిషనర్లకు మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో మూడు, నాలుగేళ్ల క్రితం వరకు గ్రామ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలు తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా అప్​గ్రేడ్‌‌‌‌ అయ్యాయి. అయితే కొందరు అప్పటి గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు తీసుకున్నామని చెప్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటిపై చర్యలు చేపట్టేందుకే తాజా ఉత్తర్వులిచ్చింది. 

ఆదేశాలు అమలు చేయకుంటే యాక్షన్
హెచ్‌‌‌‌ఎండీఏ అనుమతితో గ్రామ పంచాయతీలు గ్రౌండ్‌‌‌‌ ప్లస్‌‌‌‌ రెండంతస్తుల వరకు నిర్మాణాలకు మాత్రమే పర్మిషన్‌‌‌‌ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అపార్ట్‌‌‌‌మెంట్లు, గేటెడ్‌‌‌‌ కమ్యూనిటీలు, లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీలకు లేదని అంటున్నారు. కొన్ని నిర్మాణాలకు పాత గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకున్నామని చెప్తూ కొందరు పనులు చేస్తున్నారని, వాటికి హెచ్‌‌‌‌ఎండీఏ పర్మిషన్లు లేకుంటే చర్యలు చేపట్టాలని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కమిషనర్లు సంబంధిత ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలను తనిఖీ చేసి, వాటికి పర్మిషన్లు లేనట్టు తేలితే మున్సిపల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌, టీఎస్‌‌‌‌ బీపాస్‌‌‌‌ చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలు, వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టారనే వివరాలతో ప్రభుత్వానికి ఈ నెల 30లోపు నివేదిక ఇవ్వాలన్నారు. తాము ఇచ్చే ఆదేశాలను అమలు చేయని కమిషనర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆదేశాలు అమలయ్యేలా మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ చర్యలు చేపట్టాలని సూచించారు.

రెగ్యులరైజేషన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇస్తారా?
బోడుప్పల్‌‌‌‌, పీర్జాదిగూడ, బడంగ్‌‌‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌‌‌, మీర్‌‌‌‌పేట, జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, నిజాంపేట్‌‌‌‌ కార్పొరేషన్లు.. దమ్మాయిగూడ, దుండిగల్‌‌‌‌, ఘట్కేసర్‌‌‌‌, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్‌‌‌‌, పోచారం, నాగారం, ఆదిభట్ల, జల్‌‌‌‌పల్లి, కొత్తూరు, మణికొండ, నార్సింగి, పెద్ద అంబర్‌‌‌‌పేట, శంషాబాద్‌‌‌‌, తూంకుంట, తుర్కయాంజల్‌‌‌‌, అమీన్‌‌‌‌పూర్‌‌‌‌, బొల్లారం, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, భువనగిరి, చౌటుప్పల్‌‌‌‌, సంగారెడ్డి, తెల్లాపూర్‌‌‌‌, తూప్రాన్‌‌‌‌, నర్సాపూర్‌‌‌‌, షాద్‌‌‌‌నగర్‌‌‌‌ మున్సిపాలిటీల్లో అక్రమ వెంచర్లు వెలిశాయి. వీటి పరిధిలో పలు నిర్మాణాలు సాగుతున్నాయి. వాటిలో చాలా వరకు పాత గ్రామ పంచాయతీల నుంచి పర్మిషన్‌‌‌‌ తీసుకున్నవేనని సమాచారం. ఆయా అక్రమ లే ఔట్లు, వెంచర్లు, అపార్ట్‌‌‌‌మెంట్ల రెగ్యులరైజేషన్‌‌‌‌కు అవకాశం ఇచ్చేందుకే ఈ ఉత్తర్వులిచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, వాటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అనుమతులు ఇవ్వడం సాధ్యం అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాల లెక్క తేలిన తర్వాత వాటి రెగ్యులరైజేషన్‌‌‌‌కు ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చే అవకాశముందని సమాచారం.