నిలోఫర్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోండి: మంత్రి దామోదర

నిలోఫర్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోండి: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన వైద్య సేవలు, సిబ్బంది నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. గురువారం (సెప్టెంబర్ 18) ఆయన ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలో రెండవ అత్యధిక ఓపీ, ఐపీ వైద్య సేవలు అందిస్తున్న నిలోఫర్ ఆసుపత్రి బలోపేతంపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.." నిలోఫర్ ఆసుపత్రిలో అన్ని విభాగాలను పటిష్ఠం చేయాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి. పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. చికిత్స కోసం వచ్చే రోగుల అటెండర్లకు ఆసుపత్రి ప్రాంగణంలోనే అవసరమైన వసతులు కల్పించాలని" అని అధికారులను ఆదేశించారు. 

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సిబ్బంది పెంపు, ఎక్విప్‌‌మెంట్ మరమ్మతులు, ఆర్‌‌ఓ వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ, రోగులు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి  స్పష్టం చేశారు.