
- యూనివర్సిటీలకు యూజీసీ సూచన
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్ల భర్తీకి దేశంలోని ఆయా యూనివర్సిటీలు సొంతంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసుకోవచ్చని చెప్పింది. ఒకవేళ సీట్లు మిగిలిపోతే, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా భర్తీ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీలు సీట్ల భర్తీకి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ను యూజీసీ గురువారం రిలీజ్ చేసింది. యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ప్రతీ సీటు విలువైనదేనని, అన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు స్టూడెంట్లకు సీట్లిచ్చి, సీట్లు ఖాళీ లేకుండా చూడాలని కోరారు.
సీయూఈటీ స్కోర్ ద్వారా స్టూడెంట్లను యూనివర్సిటీల్లో చేర్చుకోవాలని యూజీసీ ఇప్పటికే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు లేఖలు రాసిందని ఆయన వెల్లడించారు. మూడుసార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని యూజీసీ దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో విద్యా సంవత్సరం మొత్తం సీట్లు ఖాళీగా ఉంచడం అంటే వనరులను వృధా చేయడమే అవుతుందన్నారు.