మరుగునపడ్డ తలాయి జల విద్యుత్ కేంద్రం

మరుగునపడ్డ తలాయి జల విద్యుత్ కేంద్రం
  • రాష్ట్రం వస్తే నిర్మిస్తామని మంత్రి హారీశ్​ రావు హామీ 
  • తెలంగాణ వచ్చి పదేళ్లు.. పట్టించుకోని బీఆర్ఎస్ సర్కారు
  • నిర్మాణం జరిగితే స్థానికంగా అభివృద్ధి 

ఆసిఫాబాద్, వెలుగు ; కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం తలాయి గ్రామ సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 1942–43 సంవత్సరంలో  నిజాం సర్కారు హయాంలోనే పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు నిర్మాణం జరిపినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అనంతరం నిజాం సర్కార్​ పతనం కావడంతో పనులు ఆగిపోయాయి. 2009  సంవత్సరంలో ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తలాయిలోని జల విద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.  రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు దాటింది.  సంబరాలు కూడా  చేసుకుంటున్నారు.  కానీ జల విద్యుత్​ కేంద్ర నిర్మాణం గురించి మంత్రి మరిచిపోయారు. 

ఇరు రాష్ట్రాలు..  ఉమ్మడి నిర్ణయం

 ప్రాణహిత నదిపై తెలంగాణ రాష్ట్రంలోని తలాయి గ్రామం, మహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామాల మధ్య ఈ జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం నిజాం సర్కార్ సర్వే చేసి పనులు చేపట్టింది.  నిజాం సర్కారు పతనం తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ హయాంలో రెండో సారి సర్వే జరిపించారు. 1955 సంవత్సరంలో మెషిన్లతో పనులు చేస్తుండగా  ప్రాణహిత నది ఉదృతికి ఒక ఇంజినీర్​ కొట్టుకుపోయారు. దీంతో అప్పుడున్న టెక్నాలజీతో అక్కడ నిర్మాణం అంత ఈజీ కాదని ఆపేశారు.   ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పటడంతో ఈ పనులు ముందుకు కదల్లేవు.  భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడం ప్రాణహిత నది ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దుగా మారింది.  హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు మహరాష్ట్రలో కలిశాయి.  దీంతో ఇది ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టుగా మారింది. దీని నిర్మాణంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మరుగున పడిపోయింది. 

జెన్ కో ఆఫీసర్ల సర్వే...

2007 సంవత్సరంలో  జెన్ కో అధికారులు తలాయి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు. ఇక్కడ 100 మెగావాట్ల కెపాసిటీ గల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు.  25 మెగావాట్ల సామర్థ్యం వరకే అప్పటి ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్ర పరిధిలోకి వస్తుందని మిగతాది మహారాష్ట్ర పరిధిలోకి వెళుతుందని వెనుదిరిగి వెళ్లిపోయారు. 2009 సంవత్సరంలో ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తలాయిని సందర్శించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ తలాయి జల విద్యుత్ కేంద్రం గురించి పట్టించుకున్న పాపన పోలేదు.  గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన సమయంలో దీని గురించి పట్టించుకుంటే ఇప్పటికీ పనులు పూర్తయ్యేవని 
ప్రజలు వాపోతున్నారు. 


జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే బాగుంటది..

తలాయి వద్ద జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని మంత్రి హరీశ్​ రావు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారు. దీన్ని మరిచిపోయారు. ఇప్పటికైనా విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  ఇది అన్ని రకాల అనువైన ప్రాంతం.

లంగారి అశోక్, తలాయి గ్రామం, బెజ్జూర్ మండల్