అసెంబ్లీలో తలసాని వర్సెస్​ భట్టి విక్రమార్క

అసెంబ్లీలో తలసాని వర్సెస్​ భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​ నేతల మధ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్​ పాలనలో హైద‌రాబాద్ న‌గ‌రం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అమెరికాతో పోటీపడుతున్న నగరాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. 

పట్టణ ప్రగతి అంశంపై శాసన సభలో చర్చిస్తున్న సందర్భంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే, సీఎల్​పీ లీడర్​ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయమంతా తమ హయాంలో పునాదులు వేసిన వాటి ఫలాలే అన్నారు. ఓఆర్​ఆర్, మెట్రో, ఫ్లై ఓవర్లు తదితర ఎన్నో అభివృద్ధి పనుల్ని సిటీలో కాంగ్రెస్​ చేపట్టడం వల్లే ఇంతలా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 

2 లక్షల డబుల్​ బెడ్రూం ఇళ్లు కట్టామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​కనీసం హైదరాబాద్​ పరిధిలో 1లక్ష ఇళ్లను కూడా చూపించలేకపోయారని ఆరోపించారు.  తాము సంపదను సృష్టిస్తే బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రభుత్వ స్థలాలు అమ్ముతోందని ఆరోపించారు. 

ఓఆర్​ఆర్​ లీజును 30 ఏళ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించి వచ్చిన డబ్బు, పన్నుల రూపేణా వచ్చే డబ్బంతా ఇప్పుడే ఖర్చు చేస్తే  రానున్న ప్రభుత్వాలకు ఆదాయ వనరులేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. 

పేదోళ్లు బాగుపడితే కాంగ్రెసోళ్లకు ఇష్టం ఉండదు..

భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కౌంటర్​ ఇచ్చారు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెస్​ పార్టీ నేతలకు ఇష్టం ఉండదని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో కాంగ్రెస్​పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్ కూడా లేరని అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు చొరవతో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. కరెంటు, మంచినీటి విషయంలో పబ్లిక్​ సమస్యలు పరిష్కరించామని అన్నారు. 

గతంలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు సీఎం కేసీఆర్​ పాలనను మెచ్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. డబల్​ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్​నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అని కొట్టి పారేశారు. కొల్లూరు డబుల్​ బెడ్రూం సముదాయంలో ఇళ్లు చూస్తే కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతాయని ఎద్దేవా చేశారు.